చీక‌ట్లో ఏం ప‌ని లోకేశ్‌?

తండ్రి చంద్ర‌బాబు అరెస్ట్‌తో లోకేశ్‌కు దిక్కు తోచ‌డం లేదు. ప‌ది రోజులుగా ఆయ‌న ఢిల్లీకే ప‌రిమితం అయ్యారు. ఇదేం ప‌న‌య్యా అంటే… బాబు బెయిల్ కోసం న్యాయవాదుల‌తో మాట్లాడే ప‌ని వుంద‌ని అంటున్నారు. అయితే…

తండ్రి చంద్ర‌బాబు అరెస్ట్‌తో లోకేశ్‌కు దిక్కు తోచ‌డం లేదు. ప‌ది రోజులుగా ఆయ‌న ఢిల్లీకే ప‌రిమితం అయ్యారు. ఇదేం ప‌న‌య్యా అంటే… బాబు బెయిల్ కోసం న్యాయవాదుల‌తో మాట్లాడే ప‌ని వుంద‌ని అంటున్నారు. అయితే ఏపీ ప్ర‌జానీకం మాత్రం మ‌రోలా అంటోంది. జ‌గ‌న్ దెబ్బ‌కు లోకేశ్ భ‌య‌ప‌డి ఏపీ విడిచి వెళ్లి వెళ్లార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో లోకేశ్ చేప‌ట్టిన పాద‌యాత్ర యువ‌గ‌ళంపై అప్డేట్ వ‌చ్చింది. ఈ నెల 29న లోకేశ్ తిరిగి పాద‌యాత్ర ప్రారంభిస్తార‌ని తెలుగుదేశం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు టీడీపీ పొలిటిక‌ల్ యాక్ష‌న్ టీమ్ స్ప‌ష్టం చేసింది. లోకేశ్ ఢిల్లీ నుంచి గ‌ల్లీకి రావడం టీడీపీ శ్రేణుల‌కు సంతోషాన్ని ఇచ్చేదే. బాబు జైల్లో వుంటే , క‌నీసం ఆయ‌న త‌న‌యుడైనా త‌మ మ‌ధ్య ఉన్నార‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఆత్మ విశ్వాసంతో వుంటారు.

ఇదిలా వుండ‌గా లోకేశ్ పాద‌యాత్ర‌ను చీక‌ట్లో పునఃప్రారంభించాల‌ని నిర్ణ‌యించ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ నెల 29న శుక్ర‌వారం రాత్రి 8.15 గంట‌ల‌కు పాద‌యాత్ర పునఃప్రారంభిస్తార‌ని టీడీపీ తేల్చి చెప్పింది. కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర ఆగిన ప్రాంతం నుంచే తిరిగి ప్రారంభం అవుతుంద‌ని టీడీపీ నేత‌లు తెలిపారు. పాద‌యాత్ర‌ను ప‌గ‌టి పూట ప్రారంభించకుండా, రాత్రివేళ నిద్ర‌కు ఉప‌క్ర‌మించే స‌మ‌యంలో ఏంటీ ప‌ని అని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు. ఆ స‌మ‌యంలో ప్రారంభించి, ఎంత వ‌ర‌కు న‌డుస్తార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

టీడీపీపై అభిమానం వున్న‌వాళ్లు సైతం ఆ స‌మ‌యంలో పాద‌యాత్ర‌లో పాల్గొన‌డం క‌ష్ట‌సాధ్య‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. బాబు అరెస్ట్‌, అనంత‌రం 20 రోజుల త‌ర్వాత తిరిగి ప్రారంభ‌మ‌వుతున్న పాద‌యాత్ర కావ‌డంతో స‌హ‌జంగానే టీడీపీ శ్రేణుల్లో భావోద్వేగం వుంటుంది. ఈ స‌మ‌యంలో చీక‌ట్లో పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌డం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతున్నారో అర్థం కావ‌డం లేద‌ని టీడీపీ శ్రేణుల నుంచే వినిపిస్తున్న మాట‌.