కరోనా కారణంగా టాలీవుడ్ నిర్మాతలకు నష్టమా? అంటే అంత లేదనే చెప్పాలి. ఎందుకంటే నిర్మాణంలో వున్న సినిమాలు మాత్రమే ఆగిపోయాయి. కొద్దిగా అదనపు వడ్డీలు భరించాల్సి వచ్చింది.
నిర్మాణం పూర్తి చేసుకున్నవాటిలో థియేటర్ కోసం వెయిట్ చేస్తున్నవి మహా అయితే రెండో, మూడొ మాత్రమే. అందువల్ల 90 శాతం నిర్మాతలకు సమస్య కాలేదు.
అసలు సిసలు సమస్య ఎగ్జిబిటర్లకే. థియేటర్లు మూతపడి, వ్యాపారాలు నష్టపోయి, నిర్వహణ ఖర్చులు భరించి కరోనా ఇంతా అంతా కష్టం చూపించలేదు. అయితే కరోనా కారణంగా ఫుల్ హ్యాపీ ఎవ్వరంటే డిస్ట్రిబ్యూటర్లే.
పెద్ద సినిమాలు విడుదల ముందేమీ ఆగిపోలేదు. అడ్వాన్స్ లు మునిగిపోలేదు. సంక్రాంతి సినిమాల సెటిల్ మెంట్లు చాలా వరకు ఆగి కొద్దిగా ఇబ్బంది అయింది అంతే. అది కూడా కొందరికే.
కరోనా మాత్రం డిస్ట్రిబ్యూటర్లను భలే కాపాడేసింది. కరోనా కారణంగా థియేటర్లలోకి రావాల్సిన కీలకమైన సినిమాలు అన్నీ ఓటిటిల్లోకి వచ్చాయి. దాదాపు తొంభై అయిదు శాతం డిజాస్టర్లే.
థియేటర్లలోకి వచ్చి వుంటే ఇవన్నీ తొలివారమే బకెట్ తన్నేసేవి. ఏ సినిమా అయినా దానికి తగ్గట్లు ఎన్నారై నో, ఎమ్ జి నో, అడ్వాన్స్ మీదనో డిస్ట్రిబ్యూటర్లు తీసుకుని వుండేవారు. కచ్చితంగా ఇరుక్కుని వుండేవారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా వారిని కరోనా కాపాడింది.
ముఖ్యంగా ఓవర్ సీస్ బయ్యర్లకు మరీనూ. కొన్ని సినిమాలు మూడు నాలుగు కోట్ల రేంజ్ లో, కొన్ని సినిమాలు లక్షల రేంజ్ లో అయినా కొని దొరికేసి వుండేవారు. ఇప్పుడు ఆ బెడదను కరోనా తప్పించింది.