తెలుగు సినిమా స్టార్ల వ్యాపారాలు చాలా వరకూ సినిమా ఇండస్ట్రీతోనే ముడిపడుతూ ఉంటాయి. సినీ నిర్మాణం, స్టూడియోలు, థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్.. ఈ తరహాలోనే తమకు అనుకూలమైన రంగంలోని వారి పెట్టుబడులు సాగుతూ ఉంటాయి. అయితే అరుదుగా మాత్రం వీరికి వేరే వ్యాపారాల్లో కూడా వీరి పేర్లు వినిపిస్తూ ఉంటాయి.
ఇప్పుడు నటుడు విక్టరీ వెంకటేష్ అలాంటి ప్రయత్నమే మొదలుపెట్టినట్టుగా ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వ్యాపారంలోకి వెంకటేష్ వాటాదారుగా దిగాడు. బైక్ వో అనే సంస్థ కు బ్రాండ్ అంబాసిడర్ గానే కాకుండా, ఈ సంస్థలో వెంకటేష్ పెట్టుబడులు కూడా పెట్టాడని సమాచారం.
రాబోయే రోజుల్లో అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా ఉంటుందనే అంచనాలున్నాయి. ప్రభుత్వాలు కూడా ఇ వెహికల్స్ కొనే వారికి ప్రోత్సాహకాలు అంటున్నాయి. కాలుష్య నియంత్రణ దృష్ట్యా ఇ వెహికల్సే పరిష్కారంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. చార్జింగ్ స్టేషన్ల అంశం కూడా ముఖ్యమైనదే.
ఇప్పుడు పెట్రోల్ బంకుల తరహాలోనే భవిష్యత్తు వెహికల్స్ చార్జింగ్ స్టేషన్ల అవసరం ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారీ ఎత్తున చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనేది బైక్ వో లక్ష్యమట. ఈ సంస్థకు వెంకటేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు, పార్టనర్ కూడా అని తెలుస్తోంది.