ఏదైనా విషయం వరకు పరిమితమై మాట్లాడేవారిని ప్రసంగీకులు అంటారు. అనవసర విషయాలను, ఆచరించకుండా కేవలం కూతల వరకే పరిమితమైన వారిని అధిక ప్రసంగీకులు అంటారు. ఏ సిద్ధాంతం లేకుండా జీవించడమే ఒక సిద్ధాంతంగా చెప్పుకునే వారు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నారు. సెలబ్రిటీలనైతే సోషల్‌మీడియాలో ‘ఇదిగో అప్పుడిలా, ఇప్పుడిలా ’ అంటూ వివిధ సందర్భాల్లో ఒకే వ్యక్తి రెండు మూడు రకాలుగా మాట్లాడిన వీడియోలను పెట్టి ఏకిపారేస్తారు.
ఇప్పుడా పరిస్థితిని జనసేనాని పవన్‌కల్యాణ్ ఎదుర్కొంటున్నాడు. రుతువులను బట్టి చలి, ఎండ, వర్షా కాలాలు వచ్చినట్టు పవన్‌కల్యాణ్ కూడా కాలానికి తగ్గట్టు నిర్ణయాలను మార్చుకుంటూ రాజకీయాల్లో చులకన అవుతున్నాడు. సినీరంగంలో తన నటనతో హీరోగా రాణించిన పవన్….ఇప్పుడు అదే నటన పవన్‌ను రాజకీయాల్లో కామెడీ యాక్టర్‌ను చేస్తోంది.
ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన బీజేపీకి వ్యతిరేకంగా పవన్ విమర్శలు చేశాడు. ఆ తర్వాత వామపక్షాలతో కలిసి ప్రయాణించాడు. ఈ సందర్భంగా ఆయన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం తిరిగి ఆయన అదే బీజేపీ పంచన చేరడమే.
‘మనం కలుస్తామా భారతీయ జనతాపార్టీతో. చస్తే చస్తాం గానీ భారతీయ జనతాపార్టీలో ఎప్పటికీ విలీనం చేయం. చస్తే చస్తాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ తెలుగు జాతి గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకుంటాం’
‘యాక్టర్, పార్టనర్ అంటూ ఉంటారు. మేము ఎవరితో కలసి పోటీ చేస్తున్నాం. సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిసి పోటీ చేస్తున్నాం. అర్రె మీలాగా మేము భారతీయ జనతాపార్టీని భుజాల మీద ఎక్కించుకోలేదు. స్పెషల్ కేటగిరీ కోసం నిలబడతారేమోనని చెప్పి బీజేపీ పల్లకీలు మోసాం. అంతేకానీ, రోజూ పల్లకీలు మోయడానికి దొడ్డి దారులు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నాడు మాట్లాడితే టీడీపీ పార్టనర్ అంటాడు…యాక్టర్ యాక్టర్ అంటా ఉంటాడు. అసలు జగన్‌మోహన్‌రెడ్డిని ఏమనాలి? అమిత్‌షా పార్టనర్ అనాలా? మోడీ గారి పార్టనర్ అనాలా? నేను ఒక మాట ఇచ్చానంటే నిలబడి పోతాను’
ప్రధానంగా బీజేపీ గురించి మాట్లాడిన వాటిలో వైరల్ అవుతున్నవీడియోలివి. చస్తే చస్తాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం; అమిత్‌షా పార్టనర్ అనాలా, మోడీ గారి పార్ట్‌నర్ అనాలా….పవన్ ఎంత బాగా మాట్లాడారో కదా? ఇప్పుడు ఆ మాటలన్నీ ఏ గంగలో కలిసిపోయాయని నెటిజన్లు పవన్‌ను ప్రశ్నిస్తున్నారు. చస్తే చస్తాం అంటూ నాడు అధిక ప్రసంగం చేసి, నేడు ఏ ముఖం పెట్టుకుని కాషాయం నీడన సేద తీరుతున్నారో చెప్పాలని నెటిజన్లు నిలదీస్తున్నారు. మొత్తానికి పవన్‌ను ‘అధిక ప్రసంగం’ నీడలా వెంటాడుతోంది.