గత మూడు పర్యాయాలుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించుకుంది భారతీయ జనతా పార్టీ. అయితే ఆ మూడు సార్లూ ఎదురుదెబ్బలే తగిలాయి. చివరి సారిగా కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుని బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. అయితే అప్పుడు కమలం పార్టీ చిత్తు చిత్తు అయ్యింది. కేవలం మూడంటే మూడు స్థానాలకు పరిమితం అయ్యింది. చివరకు కిరణ్ బేడీ కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీ ఆమెకు గవర్నర్ గిరిని కట్టబెట్టింది.
ఇక ఆన్ గోయింగ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. మెజారిటీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మీద ఎవరు పోటీ చేసేదీ బీజేపీ ప్రకటించలేదు. కేజ్రీవాల్ పై తమ అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు.
అలాగే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా బీజేపీ ప్రకటించలేదు. ఈ దఫా సీఎం క్యాండిడేట్ ను ప్రకటించుకోకుండానే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టే. మోడీ ప్రధానమంత్రి అయ్యాకా చాలా రాష్ట్రాల్లో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించకుండానే బరిలోకి దిగుతూ ఉంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఇదే పెద్ద నెగిటివ్ పాయింట్ అవుతూ ఉంది.
అంతా మోడీనే అన్నట్టుగా కమలం పార్టీలోకి బరిలోకి దిగి ఓడిపోతూ ఉంది. అయినా కూడా ఢిల్లీ విషయంలో మోడీనే మళ్లీ అంతా తానే అవుతున్నట్టుగా ఉన్నారు. పీఎంగా మోడీకి ఓటేసినా.. రాష్ట్రాల్లో మాత్రం ప్రజలు బీజేపీని ఓడిస్తూ ఉన్నారు. ఢిల్లీలో సీఎం క్యాండిడేట్ కూడా ప్రకటించని బీజేపీని అక్కడి ప్రజలు ఎలా ట్రీట్ చేస్తారో!