రెండు సార్లు ఢిల్లీ వెళ్తే జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కు మోడీ దర్శనమే దక్కలేదు. ఎన్నికలకు ముందు గట్టిగా విమర్శించి, అప్పుడే సాగిలాపడిపోవడానికి పవన్ రెడీగానే ఉన్నా.. ఇటీవలి ఎన్నికల సమయంలో తమ మిత్రులు-శత్రువుల గురించి బీజేపీకి మాత్రం క్లారిటీ వచ్చినట్టుగా ఉంది. ప్రత్యేకించి అంతకు ముందు తమతో ఫ్రెండ్షిప్ చేసి, తీరా ఎన్నికల్లో తాము ఓడిపోతామనే లెక్కలతో తమకు దూరం అయ్యి రాజకీయాలు చేసిన వారిని మాత్రం బీజేపీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నట్టుగా ఉంది. అందుకే చంద్రబాబు ఇప్పటి వరకూ ఢిల్లీకి వెళ్లి కమలం పార్టీ నేతలతో డైరెక్టుగా కలవలేకపోతూ ఉన్నట్టున్నారు. అలాగే చంద్రబాబుకు పార్ట్ నర్ గా పేర్గాంచిన పవన్ కల్యాణ్ విషయంలో కూడా బీజేపీ అధినాయకత్వం మరీ అంత ఉత్సాహం అయితే చూపినట్టుగా లేదు.
అక్కడకూ పవన్ కల్యాణ్ ఏపీలోనే బీజేపీ పెద్దల భజన ప్రారంభించారు. ఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో చేతులు కలిపి.. మోడీ-జగన్ ఒకటే అంటూ ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ .. ఎన్నికలు అయ్యాకా మోడీ భజన ప్రారంభించారు. అమిత్ షా నే దేశానికి రైటంటూ చెక్కభజన చేశారు. అలా భజనానంతరమే ఢిల్లీకి వెళ్లారు. బీజేపీతో కలిసి పని చేయడానికి రెడీ అని విలీన సంకేతాలు కూడా ఇచ్చారు. అంత చేసినా.. ఢిల్లీలో మాత్రం పవన్ కల్యాణ్ కు రెడ్ కార్పెట్ స్వాగతాలు లేకుండా పోయాయి.
చివరకు ఎలాగో నడ్డా దర్శనం దొరికింది. విలీనంలో సగం ప్రక్రియ పూర్తి అయ్యింది. మిగతా సగం త్వరలోనే పూర్తి కావొచ్చేమో! జనసేన అధినేతకు రాజ్యసభ సీటు, కేంద్రమంత్రి పదవి అంటూ మరో వైపు డ్యామేజ్ కవరేజ్ సాగుతూ ఉంది. చేగువేరా చెప్పి రాజకీయాల్లోకి వచ్చి, బీజేపీతో చేతులు కలిపిన పవన్ కల్యాణ్ ను ఆయనను నమ్మిన వాళ్లే ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో డ్యామేజ్ కవరేజ్ లో భాగంగా పవన్ కల్యాణ్ రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారని, అలాగే కేంద్ర మంత్రి కూడా పవన్ భజన బ్యాచ్ ఒక ప్రచారం మొదలుపెట్టింది. అది గొప్ప అని వారు భావిస్తున్నట్టుగా ఉన్నారు.
బహుశా గొప్పే కావొచ్చు.. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి.. కనీసం ఒక్క చోట కూడా గెలవలేని వ్యక్తి రాజ్యసభ సభ్యుడై కేంద్రమంత్రి అయితే.. అంత కన్నా గొప్ప ప్రహసనం మరోటి ఉండదు. పవన్ కల్యాణ్ పార్ట్ నర్ చంద్రబాబు తనయుడు రాష్ట్రమంత్రి అయ్యి ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు. ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయి పవన్ కేంద్రమంత్రి అయితే లోకేష్ కన్నా పవన్ గొప్పవాడు కావొచ్చు!