జేడీకి వైసీపీ కూడా ఒక ఆప్షన్…!

సీబీఐ మాజీ అధికారి ప్రొఫెషన్ హోదానే ఇంటిపేరుగా మార్చుకున్న జేడీ లక్ష్మీ నారాయణ ముందు వైసీపీ ఒక రాజకీయ ఆప్షన్ గా ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. దీని మీద జేడీ తన మనసులోని మాటలను…

సీబీఐ మాజీ అధికారి ప్రొఫెషన్ హోదానే ఇంటిపేరుగా మార్చుకున్న జేడీ లక్ష్మీ నారాయణ ముందు వైసీపీ ఒక రాజకీయ ఆప్షన్ గా ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. దీని మీద జేడీ తన మనసులోని మాటలను విప్పి చెప్పారు. తెలుగుదేశానికి అనుకూలమని పేరు పొందిన ఆ చానల్ జేడీ మనసులో విషయాలను అడిగి చూసింది.

మీరు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన జగన్ ఇపుడు సీఎం గా ఉన్నారు ఏమనిపిస్తోంది అంటూ ప్రశ్నించింది. దానికి జేడీ బదులిస్తూ ఆ కేసులో విషయాలు అన్నీ తేలాలి. అక్కడేమి జరిగింది లేనిది అన్నది తెలియాలి అంటూ జేడీ బదులివ్వడం గమనార్హం.

అంటే జగన్ నేరం చేశారా లేదా అన్నది కోర్టు తీర్పు వెల్లడించాలి అని జేడీ భావిస్తున్నారు. అయితే లక్ష కోట్లు తిన్నారు, దోచుకున్నారు. ఆర్ధిక ఉగ్రవాది అంటూ టీడీపీ సహా విపక్షాలు విమర్శలు చేయడం, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అత్సుత్సాహం చూపించడం ఇవన్నీ గడచిన దశాబ్దంలో చోటు చేసుకున్న పరిణామాలు.

జేడీ ఏ పార్టీలో చేరుతారు అన్న దానికి బదులిచ్చారు. తనను బీఆర్ఎస్, వైసీపీ నేతలు ఆహ్వానిస్తున్నారు అని ఓపెన్ గా చెప్పారు. ఆయనని పిలిచే పార్టీలలో టీడీపీ లేకపోవడం విశేషంగా చూడాలి. అలాగే జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన జేడీ ఇపుడు ఆ పార్టీ గురించి ప్రస్థావించడంలేదు.

తన మిత్రుడు తనతో పాటు కలసి పనిచేసిన తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఏపీ ప్రెసిడెంట్ అని ఆయన తనను ఆ పార్టీలోకి పిలుస్తున్నారు అని అంటున్నారు. అలాగే వైసీపీ వారు కూడా తనను వారి పార్టీలోకి రమ్మంటున్నారని జేడీ అంటున్నారు.

గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం పట్ల ఆ పార్టీల అజెండా ఏంటి వారు ఏ విధంగా వాటిని అమలు చేస్తారు అన్న దాని మీద తనకు స్పష్టత ఇస్తే అపుడు తాను ఏమి చేయాలన్నది ఆలోచిస్తాను అని జేడీ అంటున్నారు. అయితే వైసీపీలో చేరను అని కరాఖండీగా జేడీ చెప్పకపోవడమే ఇక్కడ విషయం. జేడీ వైసీపీ ప్రభుత్వం చేసే మంచి పనులు మెచ్చుకుంటారు. ఏదైనా పొరపాట్లు జరిగితే మాత్రం ఆయన విమర్శిస్తారు.

నిర్మాణాత్మకమైన విపక్ష నేత పాత్రను ఆయన పోషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్న జేడీ ముందు ఉన్న ఆప్షనల్లో వైసీపీ కూడా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి  ఏమి జరుగుతుందో అన్న వారూ ఉన్నారు.