ఏపీ రాజకీయంలో పవన్ కల్యాణ్ ది క్రమంగా ప్రేక్షక పాత్రగా మారిపోయింది. పార్టీ పెట్టిన పది సంవత్సరాల తర్వాత కూడా ఎవరో గెలిస్తే పవన్ కల్యాణ్ ట్వీట్లు పెట్టుకునే పరిస్థితులను దాటి రాలేకపోతున్నాడు!
ఊళ్లో పెళ్లికి పవన్ కల్యాణ్ హడావుడి చేస్తున్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. తనది మేధస్సుగా, పెద్ద పెద్ద మేధావుల పేర్లను చెప్పే పవన్ కల్యాణ్ ఎందుకు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తన పార్టీ తరఫున ఎవరినీ నిలపలేకపోయాడు! లేదా ఏదో ఒక పార్టీకి నామమాత్రమైన మద్దతు అయినా ప్రకటించలేకపోయాడు అంటే సమాధానం లేదు!
కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడితే చూడాలనుకోవడం తప్ప పవన్ కల్యాణ్ కు అంతకు మించిన సీన్ ఇప్పటి వరకూ లేదు! గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎటో ఒకవైపు నిలబడి ఉంటే ఆయన స్టామినా నిరూపితం అయ్యేది. తన పార్టీని పోటీలో నిలిపి కనీసం ఈ ఎన్నికల వరకూ అయినా ఓట్లను చీలనిచ్చి ఉంటే.. తెలుగుదేశం పార్టీకి అయినా పవన్ కల్యాణ్ విలువ అర్థం అయ్యేదేమో!
ఓట్లను చీలనివ్వకపోవడం అంటే పోటీ చేయకపోవం అని ఇప్పుడు పవన్ కల్యాణ్ తత్వం జనాలకు అర్థం అవుతూ ఉంది. నిజంగానే పవన్ కల్యాణ్ కు ఓట్లను చీల్చే శక్తి అయినా ఉంది ఇప్పటికీ అని జనాలు నమ్మాలంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయాల్సింది. వాటిల్లో తన సత్తా చూపించి ఉంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో బేరానికి అయినా ఒక విలువ ఉండేది!
ఇది పవన్ కల్యాణ్ శ్రేయోభిలాషులు కూడా కోరుకునే అంశం. అయితే పవన్ కల్యాణ్ కు ఇలాంటివి చేతగాని విషయాలు కావొచ్చు, లేదా ఆయన చెప్పే సిద్దాంతాలకు విరుద్ధం కావొచ్చు!
కేవలం వైఎస్ జగన్ ఓడిపోతే చూడాలనుకునే రాజకీయం తప్ప పవన్ కల్యాణ్ కు ఇంకో అర్థం, పరమార్థం లేదని ఎప్పటికప్పుడు మరింతగా క్లారిటీ వస్తోంది. అదేదో సినిమాలో పవన్ కల్యాణే చెబుతాడు, నువ్వు గెలవాలనుకో, కానీ పక్కవాడు ఓడిపోవాలని కాదు తరహాలో. మరి తనది రెండో తరహా అని స్పష్టత ఇస్తున్నాడు పీకే. మరి ఈ తీరుతో పవన్ కల్యాణ్ పొలిటికల్ హీరో అయ్యేదెలా?