గిరిపుత్రులు మండిపోతున్నారు

తాజాగా ముగిసిన ఏపీ బడ్జెట్ సమావేశాలలో చివరి రోజున వైసీపీ ప్రభుత్వం కీలకమైన రెండు తీర్మానానలు ఆమోదించి కేంద్రానికి పంపించింది. అందులో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఒకటి ఉంటే రెండవది ఏపీలో…

తాజాగా ముగిసిన ఏపీ బడ్జెట్ సమావేశాలలో చివరి రోజున వైసీపీ ప్రభుత్వం కీలకమైన రెండు తీర్మానానలు ఆమోదించి కేంద్రానికి పంపించింది. అందులో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఒకటి ఉంటే రెండవది ఏపీలో ఉన్న బోయ కులస్తులను ఎస్టీలలో చేర్చాలని కోరుతూ తీర్మానం చేశారు.

మొదటి తీర్మానం పట్ల బీజేపీ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏమిటి అంటూ ఆ పార్టీ ఆందోళనలు చేస్తోంది. గతంలో చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకుని దెబ్బ తిన్నారని కూడా ఆ పార్టీ అంటోంది. రెండవ నిర్ణయం పట్ల గిరిపుత్రులు రగిలిపోతున్నారు. బోయ కులస్తులను వాల్మీకి కులంలో చేర్చరాదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది తమ ప్రయోజనలను దెబ్బ తీసే చర్యగా పేర్కొంటున్నారు.

ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలాని కోరుతూ ఈ నెల 31న అల్లూరి సీతారామరాజు జిల్లాలో బంద్ ని చేపట్టడానికి గిరిజన జేఏసీ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. ప్రభుత్వం గిరిపుత్రుల గుండెలలో చిచ్చు పెట్టిందని, దీని వల్ల ముప్పయి అయిదు లక్షా మంది గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు అంటున్నారు. 

బోయ కులస్తులు నలభై లక్షల మంది ఏపీలో ఉన్నారని, ఏడు శాతం ఎస్టీ రిజర్వేషన్లలో తమకంటే వారికే లబ్ది ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాము ఉద్యమాన్ని మరింతగా విస్తరిస్తామని హెచ్చరిస్తున్నారు. బంద్ అందులో మొదటి మెట్టుగా పేర్కొంటున్నారు.

ఏపీలో గిరిజనుల మద్దతు ఎపుడూ వైసీపీకే ఉంటుంది, 2014లో ఒక్క సీటు తప్ప అన్నీ ఎస్టీ సీట్లూ వైసీపీనే గెలుచుకుంది. 2019లో ఏడింటికి ఏడూ వైసీపీ పరం అయ్యాయి. అలాంటి చోట గిరిజనులు ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల వ్యతిరేకత చూపిస్తున్నారు. దీని మీద ప్రభుత్వ పెద్దలను ఎస్టీ ఎమ్మెల్యేలను కలసి తన బాధను విన్నవించుకుంటారు. వారికి ఎలా సర్దిచెప్పి వైసీపీ ఎస్టీ ఎమ్మెల్యేలు ముందుకు సాగుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.