ఏకపక్ష ఎన్నికల ఫలితాలతో నిస్సారంగా అనిపించిన ఏపీ రాజకీయం రసకందాయకంలో పడింది. ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఒక రేంజ్ లో ఉంది. సంచలన రీతిలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ సీట్లను 23 ఎంపీ సీట్లను నెగ్గింది. ఆ ఓటమితో తెలుగుదేశం పార్టీ కుదేలయ్యింది.
జగన్ ను తాము అన్ని రకాలుగానూ అణిచి వేశామని పచ్చమీడియా అంత వరకూ లెక్కలు వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల, ఎంపీల కొనుగోలుతో తన వ్యూహం ఒక రేంజ్ లో పారిందని చంద్రబాబు వేసుకున్న లెక్కలకూ చిక్కులు తప్పలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డితో తలపడిన చంద్రబాబు నాయుడు, 23 మంది ఎమ్మెల్యేలతో జగన్ తో తలపడుతూ వచ్చారు. ఈ పరిణామాల మధ్యన కూడా తెలుగుదేశం పార్టీకి అనేక సెట్ బ్యాక్స్ తప్పలేదు!
ప్రత్యేకించి స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడింది. రాష్ట్రమంతా కలిసి రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ పరువు నిలిచింది. ఇక కుప్పం పరిధిలో కూడా తెలుగుదేశం పార్టీ చిత్తయ్యింది. ఆ పరిణామాల మధ్యన ఎన్నికల బహిష్కరణ అంటూ చంద్రబాబు నాయుడు పలాయన వాదాన్ని నమ్ముకున్నారు!
అయితే చంద్రబాబుకు అలాంటి వ్యూహాలు కొత్త కాదు. చేతకానప్పుడు అలాంటి పలాయన వాదాన్ని నమ్ముకుని అందరినీ తను చెప్పిందే నమ్మాలంటూ చంద్రబాబు దబాయిస్తూ ఉంటారు. పోరాటాన్ని కాకుండా పారిపోయిన పార్టీని జనాలు పట్టించుకోరు. కొంతలో కొంత నయం కనీసం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అయినా పోటీలో నిలవాలని తెలుగుదేశం పార్టీ అనుకోవడం! స్థానిక ఎన్నికల్లోనే సీరియస్ గా పోటీ చేయని పార్టీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నిలబడటం కూడా విచిత్రమే! అయితే అందులో చాలా వరకూ అభ్యర్థుల పట్టుదల కనిపిస్తుంది.
తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నిలిచి, గెలిచిన అభ్యర్థులు చాలా కాలం నుంచి ఆ సీట్లపై ఆశలు పెట్టుకుని పని చేశారు! అధికార పార్టీ అభ్యర్థులకు ధీటుగా వీరు మొదటి నుంచి పోటీ పడ్డారు. ఓట్ల నమోదు విషయంలో కానీ, ఓటును అడుక్కోవడంలో కానీ వీరు ఏ దశలోనూ వెనుకడుగు వేయలేదు. విజయం తమదేనంటూ అధికార పార్టీ అభ్యర్థులు పదే పదే ప్రకటించుకుంటూ వచ్చినా, తెలుగుదేశం పార్టీ తరఫున నిలిచినవారు ఏ దశలోనూ నిస్పృహకు గురైన దాఖలాలు లేవు.
దాదాపు ఐదారు నెలల కిందటి నుంచినే వీరు ఓటర్లను నమోదు చేయించుకోవడం, నమోదు చేయించిన ఓటర్లతో టచ్ లో ఉండటం, ఇలా కార్యక్షేత్రంలో గట్టిగా పని చేస్తూ వచ్చారు. వీరికి తెలుగుదేశం పార్టీ ఎంత వరకూ ఆదరణను చూపింది, పార్టీలో క్రియాశీల నేతలు కాని ఈ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ పాత కాపులు ఎంత వరకూ సహకరించరనేది వేరే చర్చ!
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని సెలబ్రేట్ చేసిన వారిలో పట్టుమని పది శాతం మంది కూడా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సహకరించిన దాఖలాలు లేవు! వీరి గెలుపుకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పని చేసింది కూడా లేదు! కేవలం ఎమ్మెల్సీ సీటుకు బరిలో దిగిన అభ్యర్థుల చొరవతోనే వారి విజయం సాధ్యం అయ్యింది. గాలికిపోయే పిండి కృష్ణార్పణం అన్నట్టుగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని తెలుగుదేశం నేతలంతా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు!
దీనికి తోడు రాయలసీమకు సంబంధించి రెండు సీట్లలోనూ తెలుగుదేశం పార్టీ విజయానికి మరిన్ని కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది అధికార పార్టీ నిర్లక్ష్యపూరిత ధోరణి. విజయం పై విపరీత ధీమానే వారిని మొదట దెబ్బతీసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా ఓటు వేయగల గ్రాడ్యుయేట్ల వెంట పడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు.
తమ బంధువర్గాలు, ఎమ్మెల్యేలు పరిచయం చేసిన కొందరు ఓటేస్తే చాలు తాము గెలిచేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఓటర్ చేత ఓటు ను నమోదు చేయించడంలో కానీ, వారికి పోలింగ్ బూత్ వరకూ తీసుకోవరావడంలో కానీ అధికార పార్టీ వారి అశ్రద్ధ స్పష్టంగా ఉంది. సరిగ్గా ఇదే విషయంలో తెలుగుదేశం అభ్యర్థులు చాలా శ్రద్ధతో పని చేశారు.
కనీసం ద్వితీయ ప్రాధాన్యత ఓటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అడ్డుక్కోలేదు! తాము మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిచేస్తామనే అతి విశ్వాసం వారిది. ప్రత్యర్థులను అనామకులు అనుకున్నారు. వారి పని చేస్తున్నంత శ్రద్ధగా పని చేయకుండా ఎదురుదెబ్బలు తిన్నారు!
అలాగే మరో అంశం కులం కోణం. రాయలసీమలో రెండు సీట్లకూ రెండు ప్రధాన పార్టీల తరఫున రెడ్డి అభ్యర్థులు బరిలో నిలిచారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇదే సామాజికవర్గం నుంచినే పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్లు ఉంటారు! ఇది సామాజిక సత్యం. ఇతర కులాలతో పోల్చినా.. ఇప్పటికీ ఈ సామాజికవర్గంలోనే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు ఉంటారు.
ఓటును నమోదు చేయించుకోవడంలో వీరి ఉత్సాహం తక్కువే అయినా, వీరిలో కనీసం 20 నుంచి ముప్పై శాతం మంది ఈ ఎన్నికల్లో ఓటును నమోదు చేయించుకున్నారు. ఈ ఓట్లు పార్టీ పరంగా కన్నా.. పరిచయాలు, బంధుత్వాలు పేరిట చీలాయనేది కూడా క్షేత్ర స్థాయి పరిశీలనతో అర్థం అవుతున్న విషయం. ఇలాంటి చీలిక కూడా తెలుగుదేశం పార్టీకి స్వల్ప అనుకూలతను ఇచ్చింది. అలాగే రెండు ఓట్లను కలిగి ఉన్న టీచర్లు ఒక్కో ఓటును ఒక్కో వైపుకు వేశారు. టీచర్ కోటాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన, గ్రాడ్యుయేట్ ఓటును తెలుగుదేశం వైపు చేసినట్టుగా చెప్పిన టీచర్లూ చాలా మంది ఉన్నారు!
ఇలా క్షేత్ర స్థాయి పరిశీలనతో తెలుగుదేశం పార్టీ విజయం ప్రధానంగా సాంకేతికమైనదే అని చెప్పవచ్చు. ప్రజా సమస్యల విషయంలోనో, జగన్ పాలన మీదనో ఎమ్మెల్సీ ఎన్నికలను పూర్తి స్థాయిలో రిఫరండంగా భావించడం వంద శాతం కరెక్టు కాకపోవచ్చు. అందులోనూ అసలు ఎన్నికల్లో ఎన్నికల ప్రచారమూ ఇలా జరగదు, ఓటేసే పద్ధతి ఇలా కాదు, అసలైన ఫలితమూ ఇలా ఉండదు. అది వేరే కథ. గ్రాడ్యుయేట్ల ఫలితాలు సాధారణ ఎన్నికలకు వర్తించవనేది రాజకీయం తెలిసిన ఎవరిని అడిగినా చెబుతారు. అయితే తాము ఉన్నామని చెప్పుకోవడానికి మాత్రం తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు పెద్ద వరప్రదంగా నిలిచాయి.
మునిగిపోతున్న టీడీపీ నావకు ఎమ్మెల్సీ ఎన్నికలు చుక్కానిగా నిలుస్తున్నాయి. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే పోటుతో మరో ఎమ్మెల్సీ స్థానం దగ్గడం తెలుగుదేశం పార్టీకి ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ విజయం ప్రజలతో అణుమాత్రమైనా సంబంధం లేనిదే! గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొన్న తెలుగుదేశం పార్టీకి ఈ విషయం తెలిసే ఉండాలి. ఎమ్మెల్యేలూ అటూ ఇటూ తిరగడంతో బలాబలాలు తారుమారు కావని తెలుగుదేశం పార్టీకే బాగా తెలిసి ఉండాలి. అయితే ఇప్పుడు అలాంటి ఎమ్మెల్యేల తీరుతో తెలుగుదేశం పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని నెగ్గే అవకాశం వచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీ తను పుంజుకున్నట్టుగా ప్రకటించుకుంటోంది. పచ్చమీడియా హడావుడి అయితే అలాగిలాగా లేదు!
ఇక చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అనేంత స్థాయిలో పచ్చమీడియా ప్రగల్భలాలు సాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లుగా సాధించిన విజయాలను ఏ మాత్రం గుర్తించడానికి ఇష్టపడని వర్గాలు ఇప్పుడు తెలుగుదేశం సాధించిన నాలుగు ఎమ్మెల్సీల బలం మాత్రం ఏపీ రాజకీయాన్నే శాసించేవనేంత స్థాయిలో హడావుడి చేస్తున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల విజయం తెలుగుదేశం పార్టీ కి నిస్సందేహంగా వాపులాంటిదే! దీన్ని బలం అని తెలుగుదేశం అనుకోవడం కూడా కేవలం ప్రజల్లో కనీసం తమ ఉనికిని నిలుపుకోవడానికే! ఈ వాపును చూపించి తమది బలుపుగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి పచ్చమీడియా విపరీత స్థాయిలో ప్రయాస పడుతూ ఉంది. కిందపడితేనే తామది పై చేయి అని చెప్పుకునే తత్వం. అలాంటిది ఇలాంటి అవకాశాలు లభించితే ఇక ఊరికే ఉంటారా!
మరి ఈ అత్యుత్సాహం తెలుగుదేశం పార్టీని ఎటు తీసుకెళ్తుందనేదే మరో ఆసక్తిదాయకమైన అంశం. ఒకవేళ ఈ విజయాలతో పొంగిపోయి ఇక వచ్చే ఎన్నికల్లో కూడా విజయం తమదే అని తెలుగుదేశం పార్టీ, పచ్చమీడియాలు ఫిక్సయిపోయి… ఇక తిరుగులేదనుకుంటే మళ్లీ దెబ్బపడేది కూడా వారికే! ఇలా కాకుండా.. ఇప్పటికే తాము జగన్ ను ఓడించేసినట్టుగా భావించకుండా, ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎలా గెలిచారు, అక్కడి సమీకరణాలు ఏమిటి, వాటి ద్వారా తాము అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏమిటి.. అనే విషయం అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది!