అమెరికాలో జూం పల్లెలని కొన్ని ఉన్నాయి. ఇవి రెండేళ్ల క్రితమే పుట్టాయి. అవి ఎక్కడున్నాయి అని అడిగితే “ఇందుగలవందు లేవని సందేహము వలదు…” అని పాడుకోవాలి.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టినప్పుడు కొన్ని పర్యవసానాల వల్ల ఈ ఊళ్లు పుట్టాయి. ఇక్కడంతా జూం కాల్స్ లోనే పని చేస్తుంటారు. అంటే మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఇక్కడంతా వర్క్ ఫ్రం హోం బాపతే అన్నమాట.
కొన్ని సంఘటనలు జీవితాన్నే మార్చేస్తాయనుకుంటాం. కొన్ని మార్పులు జీవితాన్ని ముందుకు నడిపిస్తాయనీ అనుకుంటాం. దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసేసుకుని అడుగులు ముందుకు వేస్తాం. అయితే మార్పు శాశ్వతం కాదు అది తాత్కాలికం, మార్పు ముందుకు కాదు వెనక్కి పిలుస్తోంది అని తెలిసినప్పుడు దిగాలు పడతాం.
మనలో ఇది చాలా మందికి అనుభవంలోకి వచ్చి ఉండకపోవచ్చు కానీ ముఖ్యంగా అమెరికాలోని జూం పల్లెవాసులు మాత్రం ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు.
2020లో కోవిడ్ వచ్చింది. లాక్డౌన్ల వల్ల జనం ఇళ్ల నుంచే పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. కోవిడ్ సద్దుమణిగినా వర్క్ ఫ్రం హోం వ్యవహారం చాలా కంపెనీలు కొనసాగించాయి.
కొందరైతే ఇంటిపట్టున ఉండి రెండు మూడు ఉద్యోగాలు కూడా చేయసాగారు. దానినే మూన్లైటింగ్ అని పేర్కొన్నాయి ఎమ్మెన్సీలు. అలా చేస్తున్నవారి ఉద్యోగాలు కూడా పీకేసాయి.
అయినా పర్లేదని, ఉద్యోగం చిన్న కంపెనీలో అయినా, జీతం కాస్త తక్కువే అయినా నగరానికి దూరంగా మెరుగైన ఇంట్లో బతుకుతూ ప్రశాంతంగా ఉండొచ్చని చాలామంది నిర్ణయాలు తీసుకున్నారు.
చేసే ఉద్యోగం జూం కాల్స్ లో అయినప్పుడు నివాసం ఎక్కడుంటే మాత్రం ఏంటి? భారీ అద్దెలు కట్టి నగరాల్లో ఎందుకుండాలి? ఈ ప్రశ్నలు వేసుకుని నగరాలకి దూరంగా నాలుగైదు గదుల ఇంటిని కొనుక్కుని కొత్త జీవితాలు మొదలుపెట్టేసారు చాలా మంది.
అక్కడ ఖర్చు తక్కువ కావడం వల్ల జీతం కూడా మిగులుతూ వస్తోంది. పైగా మూన్ లైటింగ్ అనేది పెద్ద జీతాలిచ్చే పెద్ద కంపెనీలకి అంగీకారం కాదు కానీ చిన్న జీతాలిచ్చే చిన్న సైజు కంపెనీలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఈ పరిస్థితి నిన్న మొన్నటి వరకు బాగానే సాగింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిన్న కంపెనీలు కూడా ఉద్యోగాలపై వేటు వేస్తున్నాయి. ఉద్యోగం పోగానే మరొక చిన్న ఉద్యోగం దొరకడానికి కూడా కష్టమౌతోంది.
పోనీ వర్క్ ఫ్రం హోం కాకుండా ఆఫీసుకెళ్లి కూర్చుని చేసే ఉద్యోగమేదైనా ప్రయత్నించాలా అనుకుంటే అవి మళ్లీ నగరాల్లోనే తప్ప వాళ్లుంటున్న పల్లెటూళ్లల్లో దొరకవు. అలాగని ప్రస్తుత ఆర్ధిక మాంద్యం పరిస్థితుల్లో దొరకడం కూడా మునుపటంత తేలిక కాదు. అయితే ఛాయిస్ ఉంటుందనే ఆశ మాత్రం ఉంటోంది.
ఇప్పుడలా సందిగ్ధంలో ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. కాలమే వాళ్లని గట్టెంకించాలి. ఆర్ధికమాంద్యం భయాలు కొంచెం కొంచెం గా చాలామంది జీవితాల్ని వెంటాడుతున్నాయి. నగరాల నుంచి దూరంగా పల్లెలకు వెళ్లిపోయిన వారిని కూడా వదలడం లేదు.