విశాఖ వేదికగా నేటి నుండి రెండు రోజుల పాటు జీ20 సదస్సు జరగనుంది. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ థీమ్ తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. 69 మంది విదేశీ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. మొత్తం 7 సెషన్స్, ఒక వర్క్ షాప్ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
సదస్సుకు ఇవాళ సాయంత్రం సీఎం జగన్ హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు రిషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్స్ చేరుకుని 7 నుంచి 8.00 గంటల మధ్య జీ 20 డెలిగేట్స్‌తో ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
జీ 20 సదస్సు నేపథ్యంలో జీవీఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విశాఖ సుందరీకరణ కు దాదాపు 100 కోట్లు కేటాయించింది ప్రభుత్వం . ఆర్కే బీచ్ నుండి రాడిసన్ బ్లూ హోటల్ వరకూ ఉన్న మార్గాన్ని అత్యంత అందంగా తయారు చేశారు. ఎయిర్ పోర్టు నుంచి వైజాగ్ సిటీ వరకూ ఉన్న హైవే ను ముస్తాబు చేశారు. ఎటుచూసినా అతిథులకు ,ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ .. రంగురంగుల లైట్లతో వైజాగ్ ను మరింత బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు. జీ 20 సదస్సు ద్వారా విశాఖ ఇమేజ్ మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.