కొన్ని రోజులుగా విజయవాడలో వైసీపీ అనుబంధ సంఘాల సమావేశాలు జరుగుతున్నాయి. అనుబంధ సంఘాలకు తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. చెవిరెడ్డి దగ్గరుండి మరీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వైసీపీ వివిధ అనుబంధాల సంఘాల నేతలు సమావేశాలకు వెళ్లారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి ఓ గొప్ప సందేశాన్ని అనుబంధ సంఘాల సైన్యాలకు చెప్పినట్టు సమాచారం.
“ఈ దఫా మళ్లీ మనమంతా కష్టపడి వైఎస్ జగనన్నను సీఎం చేసుకుందాం. రెండో సారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ న్యాయం చేస్తాం” అని చెవిరెడ్డి గొప్ప భరోసా ఇచ్చినట్టు …ఆ సమావేశాలకు వెళ్లిన వారు చెబుతున్నారు. తొమ్మిదేళ్ల పాటు అధికారానికి దూరమై వైఎస్ జగన్ కోసం పని చేశామని, తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందం తమలో మిగిల్లేదని వారంతా అంటున్నారు.
నాలుగేళ్ల అధికారం పూర్తయిందని, జగన్‌ను సీఎం చేసేందుకు కష్టపడ్డ సామాన్య కార్యకర్తలు, గ్రామ, మండల నాయకులకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ జగన్‌ను సీఎం చేసుకుందామని, రెండోసారి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్ధరిస్తామని వైసీపీ ముఖ్య నాయకులు చెప్పడం ఏంటని అనుబంధ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ఇంతకాలం పార్టీని అధికారంలోకి తెచ్చుకునే క్రమంలో నష్టపోయిన కాలాన్ని, డబ్బును, ఇతరత్రా నష్టాన్ని ఎవరు చెల్లిస్తారని అనుబంధ సంఘాల నేతలు నిలదీస్తున్నారు. పదేపదే జగన్‌ను సీఎం చేయడానికి తాము శ్రమించాలే తప్ప, ఆయన చేసేదేమీ వుండదా? అని అనుబంధ సంఘాల సమావేశాల్లో నాయకులు మాటలకు చిర్రెత్తుకొచ్చిన వారు ప్రశ్నిస్తున్నారు.