గుడివాడలో ఎలాగైనా కొడాలి నానీని ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లను కొడాలి నోటికొచ్చినట్టే తిట్టే సంగతి తెలిసిందే. దీంతో కొడాలి నాని అంతు చూడాలనే లక్ష్యంతో టీడీపీ వుంది. వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి కొడాలి నాని గెలుపొందారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. మంత్రి పదవి నుంచి తప్పించినా, జగన్‌కు అండగా నిలబడడంలో కొడాలి ఏ మాత్రం వెనుకంజ వేయలేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గుడివాడ సీటును చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. కొడాలి నానిపై ఎన్ఆర్ఐ వెనిగళ్ల రామును నిలబెట్టాలని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కొన్నేళ్లుగా గుడివాడలో టీడీపీకి అండగా ఉంటున్న రావి వెంకటేశ్వరరావును పక్కన పెట్టేందుకే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.
వెనిగళ్ల రాము అభ్యర్థిత్వంపై చంద్రబాబు మొగ్గు చూపడానికి ప్రత్యేక కారణాలున్నాయి. కమ్మ-దళిత కాంబినేషన్ కలిసొస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. రాము భార్య దళితురాలు. క్రిస్టియన్. గత కొంత కాలంగా ఆమె గుడివాడ నియోజకవర్గంలో సామాజిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం. వెనిగళ్ల రాముకు కమ్మ సామాజిక వర్గం మద్దతు వుంటుందని చంద్రబాబు అంచనా.
ప్రధానంగా రాము దగ్గర ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయని, రావి వెంకటేశ్వరరావు వద్ద లేవని చంద్రబాబు తన సన్నిహితులతో అంటున్నారు. కొడాలిని రాము మాత్రమే దీటుగా ఎదుర్కొనే నాయకుడిగా బాబు అంచనా. రావిని వాడుకుని వదిలేస్తున్నారని ఆయన అభిమానులు విమర్శిస్తున్నారు. కొడాలికి ఎన్ఆర్ఐ ఎంత వరకూ పోటీ ఇవ్వగలరో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.