ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవని, తప్పనిసరిగా మీరే పోటీ చేయాలని పలువురికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించినట్టు వార్తలొచ్చాయి. ఇదే సందర్భంలో వారసులకు ఈ సారి టికెట్లు ఇవ్వనని తేల్చి చెప్పినట్టు విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే అవన్నీ ఉత్తుత్తిదే అని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వారసుడికి టికెట్‌ను కన్ఫార్మ్ చేసినట్టు సమాచారం.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పెద్ద కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నుంచి బరిలో దిగనున్నారు. నిజానికి చాలా రోజుల నుంచి ఈ ప్రచారం జరుగుతున్నప్పటికీ, అధికారికంగా సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇటీవల ఎట్టకేలకు తన కుమారుడి టికెట్‌కు సీఎంతో ఆమోద ముద్ర వేయించుకోవడంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విజయం సాధించారు.
చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ప్రస్తుతం తిరుపతి రూరల్ ఎంపీపీగా కొనసాగుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో తండ్రికి తోడుగా రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ఆ మధ్య చంద్రగిరి నియోజకవర్గంలో మోహిత్‌రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ, అభివృద్ధి, ఇతరత్రా నిర్ణయాల్లో మోహిత్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
తిరుపతి రూరల్ ఎంపీపీగా రాజకీయ ప్రవేశం చేయించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కుమారుడి రాజకీయ ఎదుగుదలకు వెన్నుదన్నుగా నిలిచారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పెద్ద వయసు చెవిరెడ్డికి లేదు. కానీ నియోజకవర్గ స్థాయి దాటి రాజకీయ, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనే బలమైన కోరికతో చెవిరెడ్డి తన మార్క్ అడుగులు వేస్తున్నారని తెలిసింది.
రాజకీయాల్లో లౌక్యంగా వ్యవహరిస్తూ, అందరివాడిననే భావన కలిగిస్తూ ఆశయాల్ని నెరవేర్చుకోడానికి సాగిస్తున్న ప్రయాణంలో చెవిరెడ్డి కొంత వరకు విజయం సాధించారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడికి టికెట్‌ను ఖరారు చేయించుకోవడం ఆయన ఎదుగుదలలో మరో మెట్టుగా చెప్పుకోవచ్చు.