దైవ కార్యాలు భారీగా చేయాల్సిందే …అంతా ఆ దేవుడే చూసుకుంటాడు

మరోసారి ప్రపంచం కరోనాతో అంటే కొత్త వేరియంట్ ఓమైక్రాన్ తో విలవిలలాడిపోతోంది. మన దేశం కూడా ఇందుకు మినహాయింపుకాదు. దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. జనం అప్రమత్తంగా ఉండాలని, ఎవరికివారే…

మరోసారి ప్రపంచం కరోనాతో అంటే కొత్త వేరియంట్ ఓమైక్రాన్ తో విలవిలలాడిపోతోంది. మన దేశం కూడా ఇందుకు మినహాయింపుకాదు. దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. జనం అప్రమత్తంగా ఉండాలని, ఎవరికివారే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదేపనిగా చెబుతున్నాయి. మళ్ళీ లాక్ డౌన్ వస్తుందేమోనని కొందరు భయపడుతున్నారు. మళ్ళీ ఉద్యోగాలు పోతాయని, ఆదాయాలు తగ్గుతాయని ఆందోళన పడిపోతున్నారు.

ఏది ఏమైనా పరిస్థితి సీరియస్ గానే ఉందని చెప్పొచ్చు. ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూనే, ఓమైక్రాన్ మరీ ప్రమాదకరం కాదని, ప్రాణాలు తీయదని చెబుతున్నాయి. ఇదివరకటి మాదిరిగానే ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నాయి. దీంతో ఎందుకైనా మంచిదని కొందరు నిబంధనలు పాటిస్తున్నారు. కానీ చాలామంది బేఫికర్ గా ఉంటున్నారు.

అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఓమైక్రాన్ చాలా ప్రమాదకరమని చెబుతోంది. ప్రభుత్వాలు ప్రాణభయం లేదని చెబుతుంటే చాలామంది చనిపోతున్నారని ప్రతి రోజూ విడుదలవుతున్న ప్రజారోగ్య శాఖ గణాంకాలే చెబుతున్నాయి. మూడో వేవ్ మొదలైందని ప్రజారోగ్య శాఖే ప్రకటించింది. ఫిబ్రవరిలో కరోనా తీవ్రస్థాయికి వెళుతుందని చెప్పింది కానీ విచిత్రమైన విషయం, విచారకరమైన సంగతి ఏమిటంటే … ప్రజలను జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న తెలంగాణా ప్రభుత్వం తానే కరోనాను తేలిగ్గా తీసుకుంటోంది. 

కొత్త ఏడాది వచ్చే ముందు అంటే డిసెంబర్ 31 నాడు తెలంగాణా ప్రభుత్వం క్లబ్బులు, పబ్బులు,బార్లు, మందు షాపులకు రాత్రి ఒంటిగంట వరకు పర్మిషన్ ఇచ్చేసింది. జనం కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. సంక్రాంతి పండుగకు తెలంగాణా నుంచి ఆంధ్రాలోని సొంత ఊళ్లకు జనం కుప్పలు తెప్పలుగా వెళ్లారు. ప్రభుత్వాలు కూడా ప్రత్యేక బస్సులు నడిపాయి. అంటే ప్రభుత్వం, ప్రజలు కూడా దైవం మీదనే భారం వేశారని చెప్పుకోవాలి.

ఇదిలా ఉంటే… యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ చాలా శ్రద్ధ తీసుకొని పునర్నిర్మించారు కదా. ఇది అద్భుతంగా ఉందని అనేకమంది ప్రముఖులు, కేసీఆర్ అంటే మండిపడే బీజేపీ కేంద్ర మంత్రులు, ఆ పార్టీ జాతీయ నాయకులు కూడా అనేకసార్లు పొగిడారు. ఆలయం మళ్ళీ ప్రారంభించే అంటే ఉద్ఘాటన కార్యక్రమం కూడా త్వరలోనే జరపాలని నిర్ణయించారు. అలాగే కేసీఆర్ గురువైన త్రిదండి చినజీయర్ స్వామి ముచ్చింతల్ లోని ఆయన ఆశ్రమంలో రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమం కూడా జరగబోతోంది.

ఈ రెండు కార్యక్రమాలను భారీగా నిర్వహించాలని కేసీఆర్, చినజీయర్ నిర్ణయించారు. కేసీఆర్ నిన్న చినజీయర్ ఆశ్రమానికి వెళ్లి అక్కడ మూడుగంటలకు పైగా ఉండి ఈ విషయాలన్నీ మాట్లాడి ఖరారు చేసుకున్నారు. ఈ సందర్భంగా జీయర్ స్వామి కేసీఆర్ కు ధైర్యం చెప్పారు. నరసింహ స్వామి తన కార్యం తానే చేసుకుంటాడని అన్నారు. తాను ఎలాంటి అధైర్యానికి లోను కావడంలేదని కేసీఆర్ కూడా చెప్పారు. జీయర్ ఆశ్రమంలో శ్రీ లక్ష్మి నారాయణ క్రతువు భారీగా నిర్వహించబోతున్నారు.

యాదాద్రిలో మహా సుదర్శన యాగం, కుంభప్రోక్షణ మొదలైన భారీ కార్యక్రమాలున్నాయి. ఈ రెండు కార్యక్రమాలకు అనేకమంది ప్రముఖులు రాబోతున్నారు. విదేశాల నుంచి కూడా వస్తారట. ఇక సాధారణ భక్తుల సంగతి చెప్పక్కరలేదు. మరి ఈ కార్యక్రమాలు జరిగే సమయానికి అప్పటి పరిస్థితిని బట్టి ఏమైనా ఆంక్షలు విధిస్తారో లేదో తెలియదు. ఈ మధ్య భద్రాచలంలో జరిగిన వైకుంఠ ద్వారా దర్శనం కార్యక్రమానికే జనాన్ని రావొద్దని చెప్పారు. యాదాద్రిలో, జీయర్ స్వామి ఆలయంలో నిర్వహించబోయే కార్యక్రమాలకు మొత్తం ప్రభుత్వ యంత్రంగాన్ని వినియోగిస్తున్నారు.

దీనిపై సీఎస్ సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చేశారు. కరోనా తీవ్రమవుతున్న పరిస్థితుల్లో ఈ రెండు భారీ కార్యాక్రమాలను చేయడం అవసరమా? మరెప్పుడైనా చేసుకోవచ్చుకదా. నిర్ణయించిన ముహూర్తాలకే చేయాలనుకుంటే సింపుల్ గా చేయవచ్చుకదా. కానీ భారీగానే చేయాలని జీయర్, కేసీఆర్ అనుకున్నారు. ఎందుకంటే ఇవి దేవుడి కార్యాలు కాబట్టి దేవుడే చూసుకుంటాడు. మనం నిమిత్త మాత్రులం. ఏం జరిగితే అది జరుగుతుంది. విధిని ఎవరు తప్పిస్తారు ?