చిత్ర పరిశ్రమతో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల ధరల నియంత్రణపై వివాదం నెలకున్న నేపథ్యంలో ప్రభుత్వం, టాలీవుడ్ మధ్య డైలాగ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది రాజకీయ రంగు పులుముకోవడంతో వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా దీటైన కౌంటర్లు ఇచ్చేందుకు రంగంలో దిగారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి చిత్రపరిశ్రమపై విరుచుకుపడడం హాట్ టాపిక్ అయింది.
కోవూరులో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి ఏం మాట్లాడారంటే…
“సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు. సినిమా వాళ్ల పొట్టకొడుతున్నాడట జగన్‌మోహన్‌రెడ్డి. ఎక్కడ కొడుతున్నాం. టికెట్ల ధరలు తగ్గించాం. అది పేదవాళ్లకి ముఖ్యమా? కాదా? ఈ రోజు హీరోలంతా కోట్లు సంపాదించుకుంటున్నారు. వాళ్లకేం బ్రహ్మాం డంగా, విలాసవంతమైన జీవనం సాగిస్తున్నారు.
పెద్దపెద్ద హీరోల సినిమాల టికెట్లను వంద, వెయ్యి, రెండువేల రూపాయలకు అమ్ముతున్నారు. ఇది న్యాయం అంటారా? ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా పట్టించుకున్నాడా? అసలు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనే నాయకుడు ఉన్నాడని సినీ పెద్దలు అనుకుంటున్నారా? ఎంత సేపు హైదరాబాద్‌లో కూర్చొని, తెలంగాణలో మూవీస్ చేసుకుని , అక్కడి నుంచి మాట్లాడుతున్నారే తప్ప ..ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉందని మీకు గుర్తుందా?
సినిమా టికెట్ల ధరలు తగ్గించాం..అవును తప్పేంటి? సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్మడంపై చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు, విభజిత రాష్ట్రంలో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏనాడైనా పేదల కోణంలో ఆలోచించి సినిమా టికెట్ల ధరలు తగ్గించారా? సినిమా వాళ్లు బలిసే విధంగా చేశావు.
పేదల కోసం టికెట్ల ధరలు తగ్గిస్తే నువ్వు మాట్లాడ్తావా చంద్రబాబు? సినిమా ఇండస్ట్రీలో తనకు సంబంధించిన వాళ్లు, తన కులం వాళ్లు ఉండడంతోనే బలపరుస్తున్నావ్” అని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లపురెడ్డి కులం కోణంలో సినీ సమస్యను ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నల్లపురెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.