వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మను మీడియా రెచ్చగొట్టేందుకు శత విధాలా ప్రయత్నించినా…ఆయన రెచ్చిపోలేదు. సినిమా టికెట్ల తగ్గింపుపై వివాదం నెలకున్న నేపథ్యంలో ఇటీవల వర్మ, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మధ్య ట్విటర్ వార్ నడిచింది. ఈ విషయమై నేరుగా చర్చించేందుకు అనుమతి కావాలని వర్మ ట్వీట్ చేయడం, దానిపై మంత్రి సానుకూలంగా స్పందించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రితో చర్చించేందుకు ఆర్జీవీ విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆర్జీవీని మీడియా చుట్టుముట్టింది. ఇటీవల ట్విటర్ వేదికగా మంత్రి పేర్ని నానికి సంధించిన పది ప్రశ్నలపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. తాను అలాంటి డిమాండ్లు ఏవీ చేయనని తేల్చి చెప్పాడు. అలాగే సినీ పరిశ్రమ పెద్దగా లేదా ప్రతినిధిగా ప్రభుత్వంతో చర్చించేందుకు వచ్చారా? అనే ప్రశ్నకు కూడా తన మార్క్ సమాధానం ఇచ్చారాయన.
తానొక ఫిల్మ్ మేకర్‌గా మాత్రమే మంత్రి నానితో చర్చించేందుకు వచ్చినట్టు స్పష్టం చేశారు. తాను సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉండనని మెగాస్టార్ చిరు వ్యాఖ్యలు, టికెట్ల ధరల తగ్గింపుతో తనకు నష్టం లేదని హీరో నాగార్జున వ్యాఖ్యలు, ప్రభుత్వానికి మంచు మోహన్‌బాబు లేఖ రాయడంపై స్పందించాలని వర్మను మీడియా ప్రతినిధులు అడగ్గా….అది తన పని కాదని తేల్చి చెప్పారు. ఇతరుల వ్యాఖ్యలపై తానెందుకు స్పందించాలని ఆయన ప్రశ్నించారు.
సినిమా టికెట్ల ధరలతో పాటు ఇతర సమస్యలపై కూడా చర్చిస్తారా? అని మీడియా అడగ్గా…అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. మంత్రితో చర్చించిన అనంతరం మీడియాకు వివరాలు వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. దీంతో మంత్రితో చర్చల ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వర్మతో మాట్లాడించాలనే ప్రయత్నాలు బెడిసి కొట్టాయి.