“ఆర్ఆర్ఆర్” ప్రాజెక్టుకు సంబంధించి మరో స్వీట్ రూమర్ బయటకొచ్చింది. ఈ సినిమాలో జలియాన్ వాలాబాగ్ ఘటనను రీక్రియేట్ చేయబోతున్నారట. ఇప్పటికే కొన్ని సినిమాల్లో జలియన్ వాలాబాగ్ ఘటనను చూపించారు.
ఇప్పుడు అదే సీన్ ను రాజమౌళి కూడా “ఆర్ఆర్ఆర్” లో తనదైన శైలిలో చూపించబోతున్నాడంటూ ఓ కొత్త ప్రచారం ఊపందుకుంది. “ఆర్ఆర్ఆర్” సినిమాకు స్వతంత్ర ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే రాజమౌళి స్పష్టంచేశాడు.
కేవలం అప్పటి కాలాన్ని నేపథ్యంగా తీసుకొని… అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలు కలిస్తే ఎలా ఉంటుందనే కాల్పనిక కథతోనే సినిమా చేస్తున్నామని ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు.
మూవీలో బ్రిటిషర్లు కనిపిస్తారు కానీ ఫ్రీడమ్ ఫైటింగ్ కనిపించదని కూడా చెప్పుకొచ్చాడు. అలాంటప్పుడు “ఆర్ఆర్ఆర్” లో జలియన్ వాలాబాగ్ ఘటనను పెట్టాల్సిన అవసరం లేదు.
ఓవైపు “ఆర్ఆర్ఆర్” యూనిట్ నుంచి క్లారిటీ వచ్చినప్పటికీ.. మరోవైపు ఈ సినిమాపై పుకార్లు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే రాజమౌళి లాంటి దర్శకుడు.. తన కోణంలో ఈ దుర్ఘటనను తెరపై ఆవిష్కరిస్తే చూడాలని కోరుకునే వారు కూడా ఉన్నారు.
ఇలాంటి పుకార్లతో సంబంధం లేకుండా రాజమౌళి తన పనితాను చేసుకుపోతున్నాడు. ఎన్టీఆర్-చరణ్ కాంబోలో సీన్లను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు జక్కన్న. ఆ తర్వాత అలియాభట్ సెట్స్ పైకి వస్తుంది.