‘ప్రత్యేక హోదా గురించి నన్నెందుకు అడుగుతారు’ ఇది జనసేనాని పవన్‌కల్యాణ్ మాట. విజయవాడలోని మురళి ఫార్చ్యూన్ హోటల్లో గురువారం బీజేపీ -జనసేన పార్టీల నేతల కీలక సమావేశం జరిగింది. అనంతరం ఇరు పార్టీల నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు.
గతంలో మోడీ సర్కార్ ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిందని, ప్రత్యేక ప్యాకేజీని పాచి పోయిన లడ్డూలతో పోల్చారని, ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని విలేకరులు ప్రశ్నించారు.
దీనికి పవన్‌కల్యాణ్ స్పందిస్తూ
‘ప్రత్యేక హోదా విషయమై గత పాలక పార్టీ టీడీపీ పూర్తి బాధ్యత వహించాలి. అప్పుడే వారు గట్టిగా ప్రయత్నించి ఉంటే సానుకూల స్పందన ఉండేది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీకి 22 మంది పార్లమెంట్ సభ్యులున్నారు. టీడీపీకి ముగ్గురు పార్లమెంట్ సభ్యలున్నారు. ప్రత్యేక హోదాపై ఆ రెండు పార్టీలే బాధ్యత వహించాలి’ అని చెప్పిన పవన్ సరైన సమాధానం ఇవ్వకుండా దాట వేశారు.
మరి 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న వైసీపీ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుపై ముందుకెళుతుంటే అడ్డుకుంటామని పవన్ ఏ విధంగా మాట్లాడుతారు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటిపై మాత్రం ఆ పార్టీని, ఈ పార్టీని అడగండని ఉచిత సలహాలిస్తున్న పవన్‌కు…ప్రశ్నించే నైతిక హక్కు ఉందా? బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్…ఇప్పుడు తమ దాకా వస్తే మాత్రం దాటవేత ధోరణిలో వ్యవహరించడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.