ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. ప్రతిభను ఎవరూ ఆపలేని పరిస్థితి. అరచేతిని పెట్టి సూర్యకాంతిని ఆపలేరని నిన్నటి వరకూ చెప్పేవాళ్లు. ఇప్పుడు అదే నిజమవుతోంది.
ప్రతిభ ఉంటే గుర్తింపు రావడాన్ని ఎవరూ ఆడ్డుకోలేరు. కాకపోతే కొన్నిసార్లు ఆలస్యం కావచ్చేమో కానీ, అంతకు మించి అణచివేసే పరిస్థితి తలెత్తదు.
ఇదిలా ఉండగా కిడ్స్‌కు సంబంధించిన ఓ పాట ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ దక్కించుకుని రికార్డు సృష్టించింది. బేబీ షార్క్ డుడుడుడు..బేబీ షార్క్ డుడుడు …బేబీ షార్క్…సాంగ్ యూట్యూబ్‌లో వీర విహారం చేస్తోంది. తాజాగా ఈ పాట ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ వచ్చిన వీడియోగా రికార్డులకెక్కింది.
ఇప్పటి వరకు ఏడు వందల కోట్ల మందికి పైగా ఈ వీడియోను చూశారంటే దాని ఆకర్షణ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేంటి? ఇది పేరుకు పిల్లల పాటే అయినప్పటికీ, పెద్దల్ని కూడా కట్టి పడేస్తోంది. అందుకే అన్ని కోట్ల మంది చూడగలిగారని యూట్యూబర్ నిపుణులు చెబుతున్నారు.
2016లో దక్షిణ కొరియాలో తొలుత ఆవిష్కరించిన ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. ఇంగ్లీష్‌లో సాగే ఈ బేబీ షార్క్ సాంగ్ వినసొంపుగా ఉంటుంది.
అంతేకాదు, అటు మరీ స్లోగానూ, ఇటు స్పీడ్ అనే భావన కలగకుండా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే రీతిలో పాట సాగుతుంది. పాట భావానికి తగ్గట్టు ఇద్దరు చిన్నారులు చూడ చక్కని డ్యాన్స్ వేస్తూ ప్రతి ఒక్కర్నీ అలరిస్తారు. ప్రస్తుత పాట తొలుత రూపొందించిన పాటకు రీమిక్స్ కావడం గమనార్హం.