అనుభవజ్ఞుడు అని ఐదేళ్ల పాటు ఏపీ ప్రజలు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని కనీసం ఇరవై యేళ్లు కోలుకోలేని స్థితికి నెట్టినట్టుగా ఉన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.
తనను తాను అభివృద్ధి ప్రదాతగా చెప్పుకుంటూ.. రాష్ట్రానికి పలు గుదిబండలను తగిలించిన ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే! తన కులం, తన విలాసం, తన పార్టీ వాళ్ల బాగు తప్ప పాలించేందుకు మరో అంశమే లేనట్టుగా సాగిన చంద్రబాబు నాయుడి పాలన ఫలితంగా రాష్ట్రం అనేక రకాల సంక్షోభాలను ఎదుర్కొనక తప్పని పరిస్థితుల్లోకి పడిపోయింది.
రాయలసీమ, ఉత్తరాంధ్రలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ అమరావతి అనే గుదిబండను తగిలించడం అయితేనేం, పోలవరం ప్రాజెక్టులో తన కమిషన్లు వస్తే చాలు మరేమక్కర్లేదు అనే లెక్కలతో వ్యవహరించిన తీరైతేనేం.. రాష్ట్రాన్ని అథోగతి పాల్జేసేవి తప్ప మరోటి కాదని స్పష్టం అవుతోంది.
పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు చేసిన పనులపై విచారణ జరిపితే ఆయన జైలుకు వెళ్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రమే పూర్తి చేయాల్సిన జాతీయ ప్రాజెక్టు పోలవరం. యూపీయే హయాంలో చేసిన చట్టంతో, ఎన్డీయే హయాంలో పోలవరం నిర్మాణం జరిగే కార్యక్రమం మొదలైంది.
ఒకవేళ కేంద్రం పని కేంద్రం చేసి ఉంటే, పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని ఒత్తిడి చేయడానికి అయినా అవకాశం ఉండేది. అయితే అలా జరగనిస్తే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు ఎలా అవుతారు?
వెనుకటికి తన తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో సాగు నీటి రంగాన్నే పట్టించుకోని చంద్రబాబు నాయుడు, పోలవరంలో మాత్రం కమిషన్ల కక్కుర్తి పడ్డారు. ఫలితంగా ఆ ప్రాజెక్టు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ పోతోంది.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కీలక అనుమతులు సాధన సాధ్యం అయ్యిందని వేరే చెప్పనక్కర్లేదు. వైఎస్ చొరవ లేకపోతే ఆ అనుమతులూ ఇప్పటికీ వచ్చేవి కావేమో! అలాగే వైఎస్ హయాంలోనే పోలవరం కుడి, ఎడమ కాలువలకు సంబంధించిన పనులు కూడా ఎనభై శాతం వరకూ పూర్తయ్యియి.
కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాకా పోలవరం పనుల్లోకి ట్రాన్స్ ట్రాయ్ ఎంట్రీ ఇచ్చింది. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నాకా.. నవయుగకు ఆ పనులను అప్పగించారు. అది కూడా నామినేషన్ పద్ధతిలో పనులను అప్పగించారు.
ఈ విషయంలో నాటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వద్దకు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా వెళ్లిన దాఖలాలున్నాయి. ప్రత్యేక విమానంలో నాగపూర్ వెళ్లి గడ్కరీని ప్రసన్నం చేసుకుని చంద్రబాబు నాయుడు పోలవరం పనులను రాష్ట్రానికి, నవయుగకు అప్పగించుకున్నారు! ఇదంతా ఆన్ రికార్డెడ్ అంశమే!
పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఏటీఎంలా మార్చుకున్నారని ఎన్నికల ప్రచార సమయంలో మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అది పై పై కామెంటే అనిపించినా.. లోతుల్లోకి వెళితే చంద్రబాబు అవినీతి విశ్వరూపమే కనిపిస్తుంది!
ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ దగ్గర నుంచి చంద్రబాబు అండ్ కో చేతి వాటం ప్రదర్శించిందని స్పష్టం అవుతోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీడీపీ నేతలు ఈ భూ సేకరణ అంశంలో దళారులుగా మారి వందల కోట్ల రూపాయలకు పడగలెత్తారంటే ఆశ్చర్యం కలకమానదు.
వైఎస్ హయాంలో అనుమతులను, పూర్తైన కాలువ పనులను, కిరణ్ హయాంలో జరిగిన స్పిల్ వే పనులను కూడా చంద్రబాబు నాయుడు తన ఖాతాలోకి వేసుకోవడానికి.. ప్రతి సోమవారం పోలవారం అంటూ తన మార్కు జిమ్మిక్ ఒకటి కొనసాగించారు. ఎప్పుడో అయిన పనులన్నీ తన ఖాతాలోకి వేసుకుని డెబ్బై శాతం పనులు అయిపోయాయంటూ చెప్పుకు తిరిగారు.
సమీక్షలు తప్ప నిర్మాణ పనులు జరగలేదు. నిర్మాణ పనులు జరగకుండా ఎన్ని సమీక్షలు నిర్వహిస్తే ఏం ప్రయోజనం? అంతటితో కూడా చంద్రబాబు ఆగలేదు. అక్కడకు తన ఇంట్లో వాళ్లను తీసుకెళ్లారు. వారితో ఫొటోలు దిగి.. అదేదో తన కుటుంబం రాష్ట్రం కోసం కట్టిస్తున్న నిర్మాణం అన్నట్టుగా ప్రచారం చేయించుకున్నారు.
ఆ పై చంద్రబాబు భజన బృందాలు. భజన పాటలు పాడుతూ.. ఇలాంటి బ్యాచ్ లు పోలవరం సందర్శనకెళ్లాయి. వాటి కోసం పెట్టిన ఖర్చు కూడా రెండు వందల కోట్ల రూపాయలు!
ఈ విషయాలపై అప్పట్లో ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో ప్రస్తావిస్తే.. నాటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.. 'రాసి పెట్టుకో జగన్..' అంటూ చెబుతూ, 2018 నాటికి పోలవరం పూర్తవుతుందంటూ సినిమా డైలాగ్ రీతిన చెప్పారు.
అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పటికీ నెట్ లో ఉండనే ఉన్నాయి. 2018 పోయింది, 2019 ఎన్నికలూ జరిగాయి. ఈ క్రమంలో ఏం జరిగిందో.. ఏం రాసుకున్నారో అందరికీ తెలిసిందే!
చంద్రబాబు కమిషన్ల కక్కుర్తి, కేంద్రానికి ఎదురుతిరిగే ధైర్యం లేకపోవడం…వల్ల మరో ద్రోహం జరగనే జరిగింది! 2017లో కేంద్రం పోలవరం అంచనా వ్యయాన్ని తగ్గించి వేసింది. ప్రాజెక్ట్ వ్యయం 40వేల కోట్లు అనే అంచనాలు ఉండగా, కేంద్రం 20 వేల కోట్లకే తమ బాధ్యత అని అంటే, నాడు ఎన్డీయేలో భాగస్వామి అని చంద్రబాబు నాయుడు పల్లెత్తు మాట మాట్లాడిన దాఖలాలు లేవు.
అప్పుడు ఇద్దరు టీడీపీ ఎంపీలు మోడీ మంత్రివర్గంలో ఉన్నారు. కేంద్రమే ఆ ప్రాజెక్టు బాధ్యత తీసుకుని ఉంటే.. ఏ అంచనా వ్యయంతో కట్టుకున్నా రాష్ట్రానికి సమస్యే లేదు. అలా జరగకుండా చేసి, కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేక చంద్రబాబు నాయుడు పోలవరానికి తనే పెద్ద శాపంగా మారారు!
గడిచిన ఏడాది నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగానే సాగుతున్నాయి. ఇప్పుడు అంచనా వ్యయాలకు సంబంధించిన అంశం వెలుగులోకి వచ్చింది. పోలవరం పాత అంచనా వ్యయాలతో పని జరగడం సాధ్యం కాదు అని, సవరించిన అంచనాల మేరకే నిధుల కేటాయింపు చేయాలంటూ జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.
చంద్రబాబు హయాంలో జరిగిన అన్యాయాన్ని జగన్ ప్రభుత్వం ప్రస్తావిస్త ఉంది. తాజాగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా జగన్ ప్రభుత్వ వాదనకు అనుకూలంగా స్పందించింది. 2017-18 అంచనా వ్యయాలకు అనుగుణంగానే నిధుల కేటాయింపును కేంద్రాన్ని కోరనున్నట్టుగా పీపీఏ ప్రకటించింది. పనులైతే సాగుతున్నాయి.