ప్రముఖ తెలుగు చానల్ టీవీ9 లబోదిబోమని కొట్టుకుంటోంది. దీనంతటికి ఓ వార్తా కథనమే కారణం. దుబ్బాకలో నేడు ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారాన్ని హోరెత్తించాయి.
దుబ్బాకకు ఉప ఎన్నిక తేదీ ఖరారు అయినప్పటి నుంచి రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. ముఖ్యంగా తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ మధ్య మాటల యుద్ధమే జరిగింది.
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ తరపున రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి తలపడుతున్నారు.
నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్‌లో కొనసాగిన శ్రీనివాస్‌రెడ్డి తనకు టికెట్ దక్కకపోవడంతో రాత్రికే రాత్రి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పంచన చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మళ్లీ టీఆర్ఎస్‌లో చేరుతున్నారంటూ ప్రముఖ చానల్ టీవీ9లో ప్రసార మైనట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నిక రోజు ఈ వార్త హల్‌చల్ చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురయ్యాయి.
మరోవైపు ఆ వార్తతో తమకు సంబంధమే లేదని, తమ చానల్ పేరుతో ఫేక్ వార్తను సృష్టించి దుబ్బాక ఎన్నికను ప్రభావితం చేయాలనుకున్నారని టీవీ9 ఆగ్రహం వాపోయింది. అలాంటి కంత్రీగాళ్లపై చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీవీ9 ప్రకటించింది.
మరోవైపు తాను టీఆర్ఎస్‌లో చేరినట్లు కొన్ని చానెళ్లలో వస్తున్న వార్తలు తప్పు అని చెరుకు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఓటమి భయంతో టీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇదే అంశంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మొత్తానికి ఎన్నికల ముంగిట కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ మార్పు ప్రచారం కాక పుట్టిస్తోందని చెప్పొచ్చు.