ఇలాంటి విశాఖను ఏనాడైనా చూశారా…?

విశాఖ అంటేనే సిటీ ఆఫ్ డెస్టినీ. సుందర నగరం. పెద్దగా షోకు చేయకుండానే బాగుంటుంది. సినీ పరిభాషలో చెప్పుకోవాలంటే ఎవర్ గ్రీన్ హీరోయిన్. అలాంటి విశాఖ ఇపుడు కొత్త పెళ్ళి కూతురు మాదిరిగా ముస్తాబు…

విశాఖ అంటేనే సిటీ ఆఫ్ డెస్టినీ. సుందర నగరం. పెద్దగా షోకు చేయకుండానే బాగుంటుంది. సినీ పరిభాషలో చెప్పుకోవాలంటే ఎవర్ గ్రీన్ హీరోయిన్. అలాంటి విశాఖ ఇపుడు కొత్త పెళ్ళి కూతురు మాదిరిగా ముస్తాబు అవుతోంది. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జీ 20 పేరిట అంతర్జాతీయ సదస్సు విశాఖ వేదికగా జరగనుంది.

ఈ సదస్సుకు ఇరవై దేశాల నుంచి రెండు వందల మంది దాకా ప్రముఖులు తరలి వస్తున్నారు. వీవీఐపీలు అంతా విశాఖలో సందడి చేయనున్నారు. కేంద్ర మంత్రులు, రాయబారులు, కీలక అధికారులతో విశాఖ అంతా రానున్న మూడు నాలుగు రోజుల పాటు హడావుడిగా కనిపించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28న విశాఖకు వచ్చి మూడు రోజుల పాటు గడపనున్నారు.

జీ 20 సదస్సు కోసం విశాఖను జీవీఎంసీ అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. విశాఖలో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తోంది. అద్దాల మాదిరిగా అందమైన రోడ్లు దర్శనం ఇస్తున్నాయి. రాత్రి అయితే చాలు ఎయిర్ పోర్టు నుంచి బీచ్ రోడ్డు దాకా మొత్తం రోడ్లకు ఇరువైపులా విద్యుద్దీపాలతో చేసిన అలంకరణ పట్టపగలుగా రాత్రిని చేస్తూ వాహ్ అనిపించేస్తోంది.

విద్యుద్దీపాల కాంతులతో విశాఖ వెలిగిపోతోంది. విశాఖ బ్యూటిఫికేషన్ పనులు గత నాలుగు నెలలుగా సాగుతున్నాయి. దీని కోసం నూటాభి కోట్ల రూపాలను ఖర్చు చేశారు ఈ పనులు అన్నీ శాశ్వత ప్రాతిపదికన చేపట్టామని ఇంచార్జి మంత్రి విడదల రజనీ తెలిపారు. విశాఖ ఏపీకే కాదు దేశంలోనే అగ్ర శ్రేణి నగరమని ఆ ప్రఖ్యాతిని విఖ్యాతిని పెంచడానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి గుడివాడ అమరనాధ్ చెప్పారు.

విశాఖను ప్రస్తుతం చూస్తున్న వారు గతంలో ఎపుడైనా ఇలా చూసామా అని అనుకోవాల్సి వస్తోంది. విశాఖ అసలే టూరిస్టులకు స్వీట్ స్పాట్. ఇపుడు విశాఖ మరింత అందంగా సిద్ధం కావడంతో జీ 20 తరువాత విశాఖ మరింత రద్దీతో టూరిజీం స్పాట్ గా మారిపోవడం ఖాయమని అధికారులు అంటున్నారు. విశాఖ విశ్వ యవనిక మీద నిలిచి సొగసులీనే సుందర దృశ్యానికి ఇపుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పాలి.