ఆంధ్రజ్యోతి ఆర్కే భలే చిత్రమైన వారు. ఎప్పుడు ఎలా అక్షరాలు కుమ్మరిస్తారో ఆయనకే తెలియదేమో? జగన్ ఫుల్ స్వింగ్ లో వున్నపుడు అతన్ని, అతని చర్యలను తూర్పారపడుతూ వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం నేపధ్యంలో తెలుగుదేశం శ్రేణులు, ఇంకేం లేదు. జగన్ దిగిపోయినట్లే. అన్నంతగా హడావుడి చేస్తుంటే ఆర్కే మాత్రం అంత హడావుడి వద్దు..జగన్ ను తక్కువ అంచనా వేయద్దు..బోర్లా పడతారు జాగ్రత్త అంటూ సుద్దులు చెబుతున్నారు. జగన్ అంగ బలం, ఆర్థికబలం మామూలుగా వుండవు..వాటితో జాగ్రత్త అంటున్నారు.
పార్టీని నిర్లక్ష్యం చేయడం వల్లే చంద్రబాబు గతంలో రెండు సార్లు ఓడిపోయారని, అదే పని జగన్ కూడా చేస్తున్నారని అందువల్ల ఏ ఓటమి అయినా వారిదే తప్ప మరెవరిదీ కాదంటున్నారు. పైగా జగన్ కు సుద్దులు చెబుతున్నారు
‘’..…ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా రోజులుగా తిరుగుబాటు స్వరాన్ని వినిపిస్తున్నారు. వారిద్దరూ పార్టీకి దూరమయ్యారని తెలిశాక జగన్ జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. ఆనం, కోటంరెడ్డిని మినహాయించినా ఏడు స్థానాలను గెలుచుకోవడానికి అవసరమైన బలం జగన్‌కు ఉంది. అయితే అధికార గర్వంతో కన్నూ మిన్నూ కానని ఆయన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చేది లేదని చాలా రోజుల క్రితమే తేల్చి చెప్పారు. రాజకీయాలలో దూకుడు అన్ని వేళలా పనిచేయదు…’’
జగన్ అనుకూల మీడియా కావచ్చు, అభిమానులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు చెబుతున్నది కూడా ఇదే. కాస్త రాజకీయం, ముందు వెనుక, డ్రామా చేయడం నేర్చుకో జగనూ…ఇలా ముక్కు సూటి వ్యవహారాలు పనికి రావు అనే. కానీ జగన్ ఇలాంటి తీరు రాదు..పట్టదు. తను మళ్లీ మరోసారి లోపలకు పోవడానికి అయినా సిద్దమే తప్ప, ఒకరిని బతిమాలడం, బుజ్జగించడం తన వల్ల కాదు అంటారు. అసలు అందుకే సజ్జల, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి లను పెట్టుకున్నది కానీ ఈ ముగ్గురు మూడు కోటరీలు కావడంతో సమస్య ముదురుతోంది.
‘’…చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ను తక్కువగా అంచనా వేసుకున్నట్టుగానే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబును తక్కువగా అంచనా వేశారు. చంద్రబాబు ఇప్పుడు దెబ్బతిన్న పులి. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. జగన్‌కు దూరమైన నలుగురు ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొన్నారు. ఇది నైతికమా? అనైతికమా? అన్నది అప్రస్తుతం…’’
‘’…ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుందని తెలిసి కూడా మేకపాటి, శ్రీదేవిలకు టికెట్ ఇవ్వబోమని ముందే చెప్పడం ఏమిటి? పార్టీ టికెట్ లేదని చెప్పినా వారిరువురూ తనకు ఎదురుతిరగరని భావించడం జగన్‌లో మూర్తీభవించిన అహంకారానికి నిదర్శనం. నలుగురు ఎమ్మెల్యేలు తన చేయి దాటిపోయారని తెలిసి కూడా ఏడో స్థానానికి అభ్యర్థిని పోటీకి పెట్టడం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు. …’’
ఈ రెండు పేరాగ్రాఫ్ లు చదివితే ఏం అర్థం అవుతుంది. జగన్ మనిషి కోలా గురువులు ఓడిపోవడం తెలుగుదేశం ఘనత కాదు. జగన్ స్వయంకృతాపరాధం..ఎమ్మెల్యేలను దూరం చేసుకోవడం అని క్లారిటీ వస్తుంది. అలా క్లారిటీ వస్తే ఈ విజయానికి తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు కుల మీడియా మురిసిపోవడానికి ఏమీ వుండదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక్క సక్సెస్ వస్తే కొంతమంది చుట్టూ మూగిపోతారు. ఓటమి ఎదురైతే కలుగుల్లోకి దూరి మాయం అవుతారని ఆర్కే నే చెబుతున్నారు. ఆర్కే ఇలా అంటున్నారు.
‘’… ఈ నాలుగేళ్లలో చేసిన తప్పులు, విధ్వంసాలను సరిచేసుకోవడానికి జగన్ అండ్ కో ప్రయత్నిస్తే వారికే మంచిది. అదే సమయంలో ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ కూడా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చాయని అహం పెంచుకొని అత్యుత్సాహం ప్రదర్శించకూడదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు మాత్రం స్వల్ప విజయాలకే పొంగిపోతారు. ఓటమి ఎదురైతే అదే స్థాయిలో కుంగిపోతారు. 2019కి ముందు అధికారం అనుభవించిన పలువురు మంత్రులు, నాయకులు.. ఓటమి తర్వాత కలుగుల్లో దూరిపోయారు. ఫలానా వాళ్లు పార్టీలో ఉన్నారా? లేరా? అంటే చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా మారుతున్నది అని గ్రహించి చంద్రబాబు చుట్టూ చేరిపోతున్నారు…’’
అంతే కాదు..ఇంకా ఏం చెబుతున్నారంటే..
‘’…మొహమాటాలను పక్కన పెట్టి, కాకారాయుళ్లను, ఆషాఢభూతులను చంద్రబాబు వదిలించుకోవాలి. గడచిన కొన్ని రోజులుగా పార్టీ నాయకులు కొందరి ప్రకటనలు, వ్యాఖ్యలు గమనిస్తే అధికారంలోకి వచ్చేశామన్న అతి విశ్వాసం కనిపిస్తోంది. ఇలాంటి ప్రగల్భాలను ప్రజలు హర్షించరు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చినంత మాత్రాన అంతా అయిపోలేదు. అసలైన పోరాటం ముందుంది. జగన్ వద్ద అధికార, ధన బలం పుష్కలంగా ఉంది…’’
అంటే గ్రౌండ్ రియాల్టీ ని ఆర్కే బాగానే అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది జగన్ కొన్ని తప్పిదాలు చేసారు. దాని వల్ల ఇప్పుడు ఈ ఓటమి వచ్చింది. అంత మాత్రం చేత అంతా అయిపోయింది అని తెలుగుదేశం జనాలు గెంతులు వేయడానికి వీలు లేదు. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆర్కే సూచనలు సలహాలు ఎంత వరకు తీసుకుంటుందో తెలియదు కానీ, జగన్ మాత్రం గట్టిగానే తీసుకుంటారు. తన కోటరీని, తన తప్పులు సరిదిద్దుకోకపోతే నష్టం తనకే అని తెలిసి వచ్చి వుంటుంది ఇప్పటికే. దాని మీద మరింత దృష్టి పెడతారు ఇప్పుడు..థాంక్స్…టు …ఆర్కే.