వచ్చే ఎన్నికలకు తమ సీఎం అభ్యర్థి ఎవరో, తమ దృష్టిలో కాబోయే సీఎం ఎవరో చెప్పేశారు తెలుగు తమ్ముళ్లు. సంక్రాంతి సందర్భంగా వాళ్లు ఫ్లెక్సీలు వేయించి మరీ ఆ ఫొటోలను వైరల్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయకత్వం పై నమ్మకం, లోకేష్ సారధ్యం మీద తెలుగు తమ్ముళ్లలోనే ఎలాంటి విశ్వాసాలూ లేకుండాపోవడమో ఈ ఫ్లెక్సీ ప్రత్యేకత!
జూనియర్ ఎన్టీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా తెలుగు తమ్ముళ్లు అభివర్ణిస్తూ ఉన్నారు. అది కూడా 2024లోనే తారక్ సీఎం కాబోతున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఫ్లెక్సీ వేయించారు. అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.
అవతల తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద అపనమ్మకాలు పెరిగిపోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడును ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు గట్టిగా తిరస్కరించారు. కేవలం 23 సీట్లకు పరిమితం చేశారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడుకు వయసు మీద పడనుంది. ఇప్పుడే చంద్రబాబు నాయుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇక అమరావతి ఉద్యమం నీరు కారిపోతూ ఉంది. ఏ మాత్రం సమంజసం లేని ఉద్యమంగా అది నిలుస్తూ ఉంది.
చంద్రబాబుకు నిజంగానే తెగువే ఉంటే.. తనతో సహా తన పార్టీ ఎమ్మెల్యేలందరి చేతా రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలి. అదీ ఉద్యమం అనిపించుకుంటుంది. జోలె పట్టుకుంటే దాన్ని ఉద్యమం అనరని, దాన్ని ఏమంటారో అందరికీ తెలిసిందే అని జనాలు అనుకుంటున్నారు. ఇక లోకేష్ ఏమో.. మీడియా ముందుకు వస్తే అంతే సంగతులు. అమరావతి ఉద్యమంలో కూడా నారా లోకేష్ నోరు జారారు. తాము దాడి చేస్తే తమ మీద కేసులు పెట్టారని, రైతు చనిపోతే పరవశించడానికి వెళ్తున్నట్టుగా ప్రకటించుకుని లోకేష్ మరోసారి అభాసుపాలయ్యారు.
ఇక ఎన్టీఆర్ రావాలనే నినాదం తెలుగుదేశం పార్టీ అనుకూల సామాజికవర్గంలోనే ఉంది. అయితే అలాంటి వారిని చంద్రబాబు నాయుడు కప్పిపుచ్చుతూ వస్తున్నారు. అయితే లోకేష్ నాయకత్వం మీద ఆ సామాజికవర్గం వారికే విశ్వాసం లేదు. అందుకే ఇలాంటి పోస్టర్లు వెలస్తున్నాయి. సోషల్ మీడియాలోకి వస్తున్నాయి. లోకేష్ తో ప్రయోజనం లేదని తమ్ముళ్లే ఇలాంటి పోస్టర్లు వేస్తే చంద్రబాబుకు అంత కన్నా ఝలక్ ఉండకపోవచ్చు. మరి తెలుగుదేశం పార్టీలో ఈ పోస్టర్ల రచ్చ ఎంత వరకూ వెళ్తుందో!