రక్తదానంలో రికార్డ్.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే!

ఒకసారి రక్తం ఇవ్వడానికే ఎంతోమంది భయపడతారు. ఎక్కువసార్లు రక్తదానం చేస్తే ఏమౌతుందోనని చాలామందికి అనుమానం. అలాంటిది ఏకంగా 203 సార్లు రక్తదానం చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా ఓ మహిళ ఈ ఘనత…

ఒకసారి రక్తం ఇవ్వడానికే ఎంతోమంది భయపడతారు. ఎక్కువసార్లు రక్తదానం చేస్తే ఏమౌతుందోనని చాలామందికి అనుమానం. అలాంటిది ఏకంగా 203 సార్లు రక్తదానం చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా ఓ మహిళ ఈ ఘనత సాధించింది.

అమెరికాకు చెందిన ఈ మహిళ పేరు జోసెఫిన్ మికలక్. ప్రస్తుతం ఈమె వయసు 80 ఏళ్లు. ఇప్పటివరకు ఈమె 203 సార్లు రక్తదానం చేశారు. అలా ఆమె అత్యథికంగా రక్తదానం చేసిన మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు.

1965లో, 22 ఏళ్ల వయసులో తొలిసారి రక్తదానం చేశారు మికలక్. అప్పట్నుంచి ఆమె క్రమం తప్పకుండా రక్త దానం చేస్తూనే ఉన్నారు. ఏడాదికి కనీసం నాలుగుసార్లు ఆమె రక్తదానం చేస్తారు. మధ్యలో గర్భందాల్చినప్పుడు మాత్రం, వైద్యుల సూచన మేరకు ఆమె రక్తదానం చేయలేదు.

అలా నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది జోసెఫిన్. 80 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఆమె రక్తదానం చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాధమిక పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే రక్తదానం చేయడానికి ఆమెను వైద్యులు అనుమతిస్తున్నారు.

చాన్నాళ్ల పాటు ఈ రికార్డు ఓ భారతీయురాలి పేరిట ఉండేది. భారత్ కు చెందిన మధుర అనే మహిళ, 117 సార్లు రక్తదానం చేసి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆ రికార్డును అమెరికాకు చెందిన జోసెఫిన్ అధిగమించారు.

జోసెఫిన్ బ్లడ్ గ్రూప్ వో-పాజిటివ్. అమెరికాలో 37శాతం మంది (అత్యధికులు) ఈ గ్రూప్ కలిగి ఉన్నారు. దీంతో చాలామందికి సేవ చేసే భాగ్యం తనకు కలిగిందని జోసెఫిన్ గర్వంగా చెబుతారు. తన తుదిశ్వాస వరకు రక్తదానం చేస్తూనే ఉంటానని చెబుతున్నారామె.