మహిళా లాయర్ పాత్రలు చాలామంది పోషించారు. కానీ కామెడీ లాయర్ పాత్ర అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఫరియా అబ్దుల్లానే. జాతిరత్నాలు సినిమాలో ఆమె పోషించిన లాయర్ పాత్ర అద్భుతంగా పేలింది. కోర్టులో “ఇచ్చేయండి సర్.. ఇచ్చేయండి” అంటూ ఫరియా చెప్పిన ఫన్నీ డైలాగ్స్ ను ఎవ్వరూ మరిచిపోలేరు.
ఇలా ఫన్నీ లాయర్ పాత్రతో మెరుపులు మెరిపించిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి లాయర్ పాత్ర పోషించింది. అయితే ఈసారి కాస్త భిన్నమైన క్యారెక్టర్ అంటోంది.
“రవితేజతో రావణాసుర సినిమా చేశాను. సినిమాలో మా మధ్య కామెడీ ట్రాక్ ఉంటుంది. ఈ మూవీలో కూడా నేను లాయర్ పాత్ర పోషించాను. రవితేజ కంటే నేను సీరియర్ లాయర్ ని. మా మధ్య టామ్ అండ్ జెర్రీ టైపులో ఓ ఎపిసోడ్ నడుస్తూ ఉంటుంది.”
ఇలా రావణాసుర సినిమాలో తన పాత్ర తీరుతెన్నుల్ని బయటపెట్టింది ఫరియా. ఈ సినిమాలో ట్విస్టులు బాగా ఉంటాయని చెబుతున్న ఈ ముద్దుగుమ్మ.. రవితేజతో కలిసి నటిస్తే అలసట ఉండదని అంటోంది. సినిమాలో చాలామంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. సినిమాలో తన స్పేస్, క్యారెక్టర్ తనకు ప్రత్యేకంగా ఉందని అంటోంది ఈ 'జాతిరత్నం'.