అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు, విపత్తుల సమయాల్లో ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తున్నారో అందరం చూస్తున్నాం. బాధితులకు తక్షణం సహాయం అందించినప్పుడు మాత్రమే ప్రభుత్వం నిబద్ధత ఏంటో తెలుస్తుందని, అదే సమయంలో బాధిత కుటుంబాలకు కూడా వెంటనే ఊరట లభిస్తుందని నమ్మే వ్యక్తి జగన్.
అందుకే సహాయం విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయరు, ఆలస్యం చేయరు. ఇప్పుడు మరోసారి జగన్ తన నిబద్ధతను చాటుకున్నారు. విశాఖ యువతి హత్య ఘటనలో వెంటనే ఆర్థిక సహాయం అందించారు.
విశాఖలో కీచకుడి చేతిలో హత్యకు గురైన యువతి వరలక్ష్మి కుటుంబాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించిన 24 గంటల్లోనే, బాధిత కుటుంబానికి సహాయం అందింది. స్వయంగా హోమ్ మంత్రి సుచరిత, బాధిత యువతి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫును 10 లక్షల రూపాయల చెక్ అందించారు.
గతంలో విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన సమయంలో కూడా సీఎం జగన్ ఇలానే స్పందించారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేయకముందే ఊహించని విధంగా కోటి రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఆ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబాలకు చెక్కుల్ని అందించారు. ఇప్పుడు వరలక్ష్మి విషయంలో కూడా అంతే ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు.
కేవలం ఆర్థిక సహకారానికే పరిమితం కాకుండా.. వరలక్ష్మి కుటుంబీలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకున్నారు జగన్.
విశాఖపట్నం గాజువాకలోని శ్రీనగర్ లో శనివారం రాత్రి ఇంటర్మీడియట్ చదువుతున్న యువతి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. స్నేహంగా ఉన్నట్టు నటించిన అఖిల్, అమ్మాయిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. ఆధారాల్ని మాయం చేయడానికి ప్రయత్నించాడు.
ఆంధ్రాయూనివర్సిటీలో బీఎల్ చదువుతున్న అఖిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.