అప్పటికే కరోనాతో సతమతమవుతున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లిన అమెరికాలో కరోనా నంబర్లలో పెరుగుదల కొనసాగుతూ ఉంది. ప్రత్యేకించి ఎన్నికల ర్యాలీలతో కరోనా వ్యాప్తి కొనసాగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ఈ విషయంలో ఒక అధ్యయన ఫలితాన్ని ప్రకటించింది. కేవలం ట్రంప్ ఎన్నికల ర్యాలీల వల్లనే ఏకంగా 30 వేల మందికి కరోనా సోకిందని ఆ వర్సిటీ ప్రకటించడం గమనార్హం.
ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం చేత కరోనా వ్యాపించిందని అధ్యయనకర్తలు ప్రకటించారు. స్వయంగా ట్రంప్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అతడి మద్దతు దారులు ఎన్నికల ప్రచారానికి వెళ్లి 30 వేల మంది కరోనా తెచ్చుకున్నారట. వారిలో ఏడువందల మంది మరణించారని కూడా స్టాన్ ఫోర్డ్ వర్సిటీ పేర్కొంది!
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉత్తి పుణ్యానికి అంత మంది కరోనా బారిన పడి, వారిలో ఏడువందల మంది మరణించడం అంటే ఇది సాధారణ విషయం ఏమీ కాదు. ఎన్నికల ప్రచారానికి వెళ్లి కరోనా కారణంగా ఏడువందల మంది ప్రాణాలు పోగొట్టుకోవడం అసాధారణంగా పరిగణించాల్సిన విషయం. ఇదంతా ట్రంప్ ఎన్నికల ర్యాలీ ప్రభావం. ఇతర పార్టీల ర్యాలీలు, ఇతర ఎన్నికల ప్రక్రియతో మరెంత మంది కరోనా బారిన పడి ఉండాలి? వారిలో ఎంతమందికి అది ప్రాణాల మీద వరకూ తెచ్చి ఉండాలనే అంశం గురించి మరింత పరిశోధన జరగాలేమో!
ఇందుమూలంగా భారతీయులు గ్రహించాల్సి ఎంతో ఉంది. ఇండియాలో కూడా ఎన్నికల ప్రక్రియలు సాగుతున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, మధ్యప్రదేశ్ లో ఉప ఎన్నికలు.. ఇలా చాలా తతంగం నడుస్తూ ఉంది. అమెరికా వంటి దేశంలోనే ఎన్నికల ప్రచారంపై కరోనా ప్రభావం తప్పలేదు. మన దగ్గర ఎన్నికల ప్రచారం అంటే.. అమెరికా కన్నా చాలా రెట్లు రాసుకుపూసుకు తిరగడం ఉంటుంది. ఏపీలో స్థానిక ఎన్నికలు అంటూ ఎన్నికల కమిషనర్ ఉబలాటపడుతున్నారు. అమెరికాకు అంటే ఎన్నికలు పెట్టుకోక తప్పలేదు. వాటి ప్రభావంతో వేల మంది అకారణంగా చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. మన దగ్గర పరిస్థిలేమిటో గ్రహించి, ఇలాంటి పరిణామాలను విశ్లేషించుకుని నిర్ణయాలు తీసుకుంటే మంచిదేమో!