మొత్తానికి ఇన్నాళ్లు గుండెల్లో దాచుకున్న కోరిక బయటకు వచ్చింది. అయిదేళ్లుగా నానుతోంది విశాఖ రైల్వే జోన్ వ్యవహారం. ఆఖరికి అసలైన వాల్తేర్ డివిజన్ లోని కీలకభాగాలు తప్పించి విశాఖ జోన్ ప్రకటించారు.
ఇది ఇంకా అమలుకు అటు ఇటు అన్నట్లు వుంది. కానీ గత తెలుగుదేశం హయాంలో కనిపించినవి అన్నీ కనిపించినట్లు విజయవాడ, గుంటూరుకు తోసేసారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలపై కపట ప్రేమ కనబర్చారు.
అప్పట్లో రాయపాటి లాంటి తెలుగుదేశం నాయకులు విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ చేస్తే బెటర్ అని, విశాఖ జోన్ అనే కన్నా అదే మంచిదని అన్నారు. కానీ అప్పట్లో ప్రతిపక్షానికి భయపడి, ఉత్తరాంధ్ర వాసులకు జంకి విజయవాడ రైల్వే జోన్ గురించి అంతకన్నా ఎక్కువ మాట్లాడడం మానేసారు.
కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. అమరావతి నుంచి రెండు భాగాలు విడిపోయి విశాఖ, కర్నూలుకు వెళ్లిపోతున్నాయి. ఉత్తరాంధ్ర వాసులకు పాలన రాజధాని భాగ్యం కలగకూడదని అనేక కుట్రలు పన్నుతున్నారు, ఆందోళనలు సాగిస్తున్నారు.
ఇవన్నీ చాలవని ఉత్తరాంధ్ర వాళ్ల చేతే తమకు రాజధాని వద్దు అని ప్రకటనలు చేయిస్తున్నారు. ఉత్తరాంధ్ర జనాలు సహజంగా మెత్తనైన వారు కావడంతో అమరావతి ఉద్యమానికి పోటీ ఉద్యమం జోలికి పోలేదు.
ఇప్పుడు ఇవన్నీ చాలవన్నట్లు విశాఖకు బదులుగా విజయవాడను రైల్వే జోన్ గా చేయాలనే డిమాండ్ లు మెల్లగా వినిపించడం ప్రారంభించారు. రైల్వే యూనియన్ ఎన్నికల్లో ఈ మేరకు డిమాండ్ లు, హామీలు ప్రారంభమైపోయినట్ల వార్తలు వినవస్తున్నాయి.
అంటే అమరావతిని మీరు కొంత తీసుకుంటే మీ దగ్గర నుంచి రైల్వే జోన్ ను లాగేస్తాం అనే ఇండైరెక్ట్ హెచ్చరిక ఇక్కడ ధ్వనిస్తోంది. అంతకు మించి విశాఖ మీద అమరావతి అభిమానుల సవతి తల్లి ప్రేమ అర్థం అవుతోంది.