ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక చురుకైన నేత వస్తారని ఎవరూ ఊహించలేకపోవచ్చు. ఏయూలో అపుడే లా డిగ్రీ చేసి బయటకు వచ్చిన కింజరాపు ఎర్రన్నాయుడు అనే యువకుడు కొత్తగా ఎన్టీయార్ పెట్టిన టీడీపీలో చేరిపోయాడు. సహజంగానే అన్న గారు యువతకు, విద్యావంతులకు పెద్ద పీట వేయడంతో ఎర్రన్నకు అలా లక్కీ ఛాన్స్ వచ్చింది.
హరిశ్చంద్రపురం అసెంబ్లీ సీటు నుంచి తొలిసారి జబ్బ చరచి గెలిచారు. అప్పటికి ఆయన వయసు పాతికేళ్ళు మాత్రమే. అలా ఆ సీటు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, శ్రీకాకుళం నుంచి మరో నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు. ఆయన పదవులకు వన్నె తెచ్చారు.
ఎర్రన్న ఢిల్లీలో ఉన్న రోజుల్లో నాయుడు అంటే ఏపీ సీఎం బాబు కాదు, ఆయనే అన్నంతగా బలమైన ముద్ర వేసుకున్నారు. సమర్ధుడైన నేతగా, ఉత్తరాంధ్రా నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన ఎర్రన్న సరిగ్గా ఇదే రోజు అంటే 2012 నవంబర్ 2న శ్రీకాకుళం వెళ్తూ ఒక రోడ్డు యాక్సిడెంట్ లో దుర్మరణం చెందారు. ఎర్రన్న వారసులుగా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఉన్నా కూడా ఆయన లోటు అలాగే ఉందని అభిమానులు అంటారు.
దానికి కారణం ఆయన జనం పక్షం. కార్యకర్తల పక్షం. అన్నింటికీ మించి వెనకబాటుతనానికి గురి అయిన ఉత్తరాంధ్రా పక్షం. మరి ఎర్రన్న ఈనాడు జీవించి ఉంటే తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన చాలా కీలకంగా వ్యవహరించేవారు అని చెబుతారు.
తనను తాను ప్రజానాయకుడిగా తీర్చి దిద్దుకున్న ఎర్రన్న అవసరం అయితే ఎవరి మీదనైనా తిరుగుబాటు కూడా చేస్తారని 1989లో టీడీపీ మీదనే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన చరిత్ర చెబుతుంది. మరి ఎర్రన్న వర్ధంతి వేళ నివాళి అర్పిస్తున్న వారసులు, అభిమానులు ఆయన స్పూర్తిని కొనసాగించాలన్నదే అందరి కోరిక.