రాష్ట్రంలో ప్రభుత్వం తుమ్మినా, ప్రజలు దగ్గినా.. వెంటనే కేంద్రానికి లేఖాస్త్రాలు సంధించడం చంద్రబాబుకి బాగా అలవాటు. ఏపీలో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని, జర్నలిస్ట్ లు, న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆమధ్య ఓ భారీ లేఖను ఆయన ప్రధాని మోడీకి సంధించారు. ఈ లేఖల పర్యవసానం ఏంటనే విషయం పక్కనపెడితే.. అనుకూల మీడియాతో కలిసి బాబు ఆ లేఖలతో ఎంత రాజకీయం చేయాలో అంతా చేశారు.
అవసరం లేని వ్యవహారాలాన్నిటిపై కేంద్రానికి పితూరీలు చెప్పే చంద్రబాబు.. అవసరమైన పోలవరంపై మాత్రం లేఖ రాయకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారో ఆయనకే తెలియాలి.
పోలవరం ప్రాజెక్ట్ నిధుల్లో కోత రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. తప్పంతా టీడీపీదేనని వైసీపీ మంత్రులు, కాదు కాదు.. జగన్ కేసుల కోసమే నిధుల విషయంలో వెనక్కి తగ్గారని టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అయితే జగన్ తనవంతు బాధ్యతగా ఈనెల 28న ప్రధాని మోడీకి పోలవరంపై లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి 2017-18లో సాంకేతిక కమిటీ ఆమోదించిన రూ.55,656 కోట్ల అంచనాలను యథాతథంగా ఆమోదించాలని ప్రధానిని కోరారు జగన్. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించిన అంచనా మొత్తం అవమానకరంగా ఉందని జగన్ తన అభిప్రాయాన్ని చెప్పారు.
ఇటీవల జనసేన పార్టీ కూడా పోలవరం వ్యవహారంపై ఓ తీర్మానం చేసింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలంటూ పార్టీ నాయకులంతా ముక్త కంఠంతో కోరారు. ఈ విషయంలో బీజేపీని కలుపుకొని ముందుకెళ్తామన్నారు.
మరి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఏమైంది. జనసేన పార్టీకి ఉన్న తాపత్రయం, తపన టీడీపీకి లేవా. అయినదానికి, కానిదానికి లేఖలు రాసే బాబు.. పోలవరంపై పెన్ను, పేపర్ ఎందుకు పట్టుకోలేదు.
గతంలో కమీషన్ల కోసం కక్కుర్తిపడ్డ విషయాన్ని మోడీ ఎదురు ప్రశ్నిస్తే తన పరువు పోతుందని అనుకుంటున్నారా? పోలవరం జగన్ హయాంలో పూర్తయితే ఎక్కడ పేరు ఆయనకి వెళ్లిపోతుందని ఆలోచిస్తున్నారా? అసలు బాబు మనసులో ఏముంది?
ఓవైపు కేంద్రం నిధులు తగ్గిస్తే పోలవరం పూర్తికాదు అని అంటున్నారు కదా, మరి ఆ నిధులు పెంచాల్సిన బాధ్యత గుర్తు చేస్తూ ప్రధాన ప్రతిపక్షం హోదాలో కేంద్రానికి ఓ లేఖ రాయొచ్చు కదా? సొంత లాభం కోసం తప్ప.. ప్రజల కోసం బాబు ఎప్పుడూ లేఖ రాయరని అర్థమవుతోంది.
వైసీపీ ప్రభుత్వంపై పితూరీలు చెప్పడానికి మినహా.. ప్రజలకు మేలు చేయండి అంటూ బాబు ఎప్పుడూ కేంద్రాన్ని అభ్యర్థించలేరనే విషయం స్పష్టమవుతోంది.