గత ఏడాది నవంబరు 27న వెటర్నరీ వైద్యురాలిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం, అనంతరం హత్య, నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న సినిమాకు దిక్కూదిశా ఉన్నట్టు కనిపించడం లేదు.
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచార ఘటనపై వర్మ నిర్మించతలపెట్టిన సినిమాకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
తాజాగా దిశ హత్యాచార నిందితులైన మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు అనే నలుగురికి సంబంధించిన కుటుంబ సభ్యులు వర్మ సినిమాపై సుప్రీంకోర్టు జ్యుడిషియల్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
చిత్రంలోని తమ వాళ్లను విలన్స్‌గా చూపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వల్ల తమ కుటుంబ సభ్యుల హక్కులకు భంగం కలుగుతోందని వారు వాపోయారు. కుటుంబ సభ్యులతో పాటు పెరుగుతున్న పిల్లలపై ఈ ప్రభావం పడుతుందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎన్కౌంటర్ అయిన వారిపై సినిమా తీసి తమను మానసికంగా చంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తు చేస్తుంటే, సినిమా ఎలా తీస్తారని నిందితుల కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.
ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని వారు కోరారు. కాగా ఇటీవల దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి కూడా సినిమాను నిలుపుదల చేయాలని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
తన కుమార్తె హత్యతో పాటు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతుంటే సినిమా తీయడంపై శ్రీధర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తాజాగా మరో ఫిర్యాదు కూడా వెళ్లడంతో అసలు వర్మ సినిమా తెరకెక్కడం అనుమానమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.