కమ్మని’ కథనాల ముందు ‘సాక్షి’ తేలిపోతోందా!

అమరావతి అల్లర్ల విషయంలో టీడీపీ అనుకూల మీడియా తాను చేయగలిగినంతా చేసేస్తోంది. దాన్ని తిప్పికొట్టే సామర్థ్యం మాత్రం సాక్షి దగ్గర కొరవడింది. రైతుల కన్నీళ్లు, ఆర్తనాదాలు, వారిపై పోలీసుల లాఠీచార్జిలు, అరెస్ట్ లు, ఆందోళనలు,…

అమరావతి అల్లర్ల విషయంలో టీడీపీ అనుకూల మీడియా తాను చేయగలిగినంతా చేసేస్తోంది. దాన్ని తిప్పికొట్టే సామర్థ్యం మాత్రం సాక్షి దగ్గర కొరవడింది. రైతుల కన్నీళ్లు, ఆర్తనాదాలు, వారిపై పోలీసుల లాఠీచార్జిలు, అరెస్ట్ లు, ఆందోళనలు, పోలీసుల కవాతు.. ఇలాంటి వన్నీ ఓవర్గం మీడియా బాగా ఫోకస్ చేస్తోంది. ఎంతలా అంటే హైకోర్టు కూడా వాటిని పరిగణలోకి తీసుకునేంతలా.

మరి వాస్తవం కూడా అదేనా అంటే ఆశ్చర్యం కలగకమానదు. అమరావతి అల్లర్లు కేవలం 29గ్రామాల్లో జరిగేవే. ఈమధ్య అవి కూడా తగ్గిపోయి కేవలం మందడం గ్రామానికే పరిమితమయ్యాయి. మరి మిగతా రాష్ట్రమంతా ఏం జరుగుతోంది. రాజధాని కావాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులు ఎంత బలంగా కోరుకుంటున్నారనే విషయాన్ని జగన్ అనుకూల మీడియా గట్టిగా ఫోకస్ చేయలేకపోతోంది. చంద్రబాబుని విమర్శిస్తూ చంద్రబాబు చుట్టూనే తిరుగుతోంది తప్పితే అసలు విషయాలను బైటకు లాగాలనే ఉత్సాహం తగ్గుతున్నట్టు కనిపిస్తోంది.

మంత్రి బొత్స సత్యనారాయణను అమరావతి రైతులు కలిశారట, స్వయానా మంత్రే ఆ మాట చెప్పినా దానికి సంబంధించి ఒక్క ఫొటో కానీ, ఒక్క వీడియో కానీ బైటకు రాలేదు. మరి మంత్రి అబద్ధం చెబుతున్నారా? లేక దానికి ప్రచారం వద్దనుకుంటున్నారా?. మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రంలో చాలా చోట్ల ప్రదర్శనలు జరుగుతున్నాయి. వాటికి ఇవ్వాల్సిన ప్రయారిటీ సాక్షిలో ఇస్తున్నారా, కనీసం సోషల్ మీడియాలో అయినా ఇలాంటి వాటిపై వైసీపీ వింగ్ ఫోకస్ చేస్తోందా?

ఇవన్నీ సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఎన్నికలకు ముందు ఎంతో పగడ్బందీగా ఉన్న సాక్షి ఎడిషన్.. ఎన్నికల తర్వాత వార్తల కోసం కచ్చితంగా మరో పేపర్ చదవాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. పోనీ మిగతా పేపర్లు, ఛానెళ్ల గుంపు ముందు సాక్షి సింగిల్ గా నిలబడలేకపోతోందని అనుకున్నా.. సోషల్ మీడియా ఎవడబ్బ సొత్తు కాదు కదా, కనీసం అందులో అయినా ప్రతిపక్షాల విమర్శలకు గట్టిగా కౌంటర్లు ఇవ్వొచ్చు కదా అంటే అదీ లేదు.

చాపకిందకు నీళ్లు వస్తున్నాయని తెలిసిన వెంటనే సర్దుకోవడం మంచిది. నిండా తడిచాక ఇక చేయడానికేం ఉండదు. ఈ విషయాన్ని సాక్షి మీడియాతో పాటు, వైసీపీ సోషల్ మీడియా  ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.