వలస పక్షులకు గొంతు పెగలడం లేదుగా..!

విశాఖ అంటేనే వలస పక్షులకు కేంద్రంగా చెప్పుకుంటారు. ఇక్కడికి వచ్చి రాజకీయంగా చెడిపోయిన వారు ఎవరూ లేరు. ఎక్కడో ఉన్న నెల్లూరు నుంచి ప్రకాశం నుంచి, క్రిష్ణా, గుంటూరుల నుంచి విశాఖ వచ్చి రాజకీయంగా…

విశాఖ అంటేనే వలస పక్షులకు కేంద్రంగా చెప్పుకుంటారు. ఇక్కడికి వచ్చి రాజకీయంగా చెడిపోయిన వారు ఎవరూ లేరు. ఎక్కడో ఉన్న నెల్లూరు నుంచి ప్రకాశం నుంచి, క్రిష్ణా, గుంటూరుల నుంచి విశాఖ వచ్చి రాజకీయంగా పెద్ద పదవులు అందుకున్న వారు ఎందరో ఉన్నారు.

ఇపుడు వారందరికీ విశాఖ రాజధాని అంటే ఏదోలా ఉందిట. తాము పుట్టిన గడ్డ మీద ఠికాణా లేక వూరు వదిలి వచ్చిన వారిని అక్కున చేర్చుకున్న ఈ నగరం రాజధాని హోదా సంతరించుకుంటానంటే మాత్రం ఎందుకో మనసొప్పడంలేదుట.

అవును మరి విశాఖ ఎదగాలి, ఎంత ఎదగాలి అంటే తాము కోరుకున్నంతగా. ఆ ఎదుగుదల తమ కోసమే కావాలి. తామే అన్నీ అనుభవించాలి. ఇక్కడ అభివ్రుధ్ధి మాత్రం జరగకూడదు. ఇదీ కదా అసలైన పాలిట్రిక్స్.

విశాఖకు రైల్వే జోన్ ఏదో మోడీ దయ వల్ల వచ్చింది కానీ దాన్ని విజయవాడకు తీసుకుపోవాలని విశాఖలో  గెలిచిన ప్రజాప్రతినిధులు ఎంతలా క్రుషి చేశారో నగరవాసులకు ఎరుకే.

ఇక విశాఖకు రెండవ పోర్టు రాకుండా ఆడిన నాటకాలు, దాన్ని తమ సొంత ప్రాంతాలలో పెట్టాలని ప్రతిపాదించిన  తీరు కూడా వైజాగ్ జనాల‌కు తెలిసిందే. విశాఖకు  మెట్రో రైలు ప్రాజెక్ట్  ఎందుకు అని నాటి సర్కార్ ఫైల్ మూలన పడేస్తే అడిగే వారు లేరు.

ఇక్కడ ఉన్న ఒకే ఒక ఫ్లై ఓవర్ కూడా నాటి కాంగ్రెస్ సర్కార్ టైంలో నిర్మాణం జరుపుకున్నదే. మాటకు వస్తే చాలు విశాఖ అంటే ప్రేమ కురిపిస్తారు. చేతలకు మాత్రం మన నాన్ లోకల్ పొలిటీషియన్లు అసలు ముందుకు రారు.

విశాఖను రాజధానిగా ఎవరూ కోరుకోలేదని ఇపుడు తాపీగా అంటారు. విశాఖలో రాజధాని పెడితే అశాంతి చెలరేగుతుందని. నిజమే విశాఖ కోసం పోరాడే స్థానిక గొంతుక‌లు ఎన్నుకోవడం మాని జనం పెద్ద తప్పు చేశారు.

అందుకే విశాఖ రాజధాని కావాలని మేధావులు, ప్రజాసంఘాలు ఎంత గట్టిగా అరచి గీ పెడుతున్నా ఎవరికీ వినిపించదు,  కనిపించదు.  వలసపక్షులు మాత్రం విశాఖ రాజధాని అక్కరలేదని తీర్మానించేస్తారు. ఇది కదా అసలైన పొలిటికల్ సీన్.