సినిమా రివ్యూ: ఎంత మంచివాడవురా

సమీక్ష: ఎంత మంచివాడవురా రేటింగ్‌: 2/5 బ్యానర్‌: ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రై.లి. తారాగణం: నందమూరి కళ్యాణ్‌రామ్‌, మెహ్రీన్‌, రాజీవ్‌ కనకాల, నరేష్‌, వెన్నెల కిషోర్‌, విజయ్‌కుమార్‌, శుభలేఖ సుధాకర్‌, ప్రవీణ్‌, సుదర్శన్‌ తదితరులు…

సమీక్ష: ఎంత మంచివాడవురా
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రై.లి.
తారాగణం: నందమూరి కళ్యాణ్‌రామ్‌, మెహ్రీన్‌, రాజీవ్‌ కనకాల, నరేష్‌, వెన్నెల కిషోర్‌, విజయ్‌కుమార్‌, శుభలేఖ సుధాకర్‌, ప్రవీణ్‌, సుదర్శన్‌ తదితరులు
కూర్పు: తమ్మిరాజు
సంగీతం: గోపి సుందర్‌
ఛాయాగ్రహణం: రాజ్‌ తోట
నిర్మాతలు: ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా
రచన, దర్శకత్వం: వేగేశ్న సతీష్‌
విడుదల తేదీ: జనవరి 15, 2020

సొంత బంధువులు తనని అనాధగా వదిలేస్తే తనలా ఆప్తులకి దూరంగా బాధ పడుతోన్న వారికి ఆ లోటు తీర్చడానికి కోరిన బంధువుగా వెళుతుంటాడు ఇందులోని కథానాయకుడు. అయినవారు, చుట్టరికాలు అవసరం చెప్పే ప్రయత్నం చేసిన ఈ చిత్రం తెరకెక్కించిన విధానం మాత్రం… సాటి ప్రేక్షకులతో చుట్టరికం కలుపుకుని ఈ సినిమా తాలూకు కష్టాలు చెప్పుకోవాల్సిన అవసరాన్ని కల్పించే స్థాయిలో విసిగించింది. కుళ్లు జోక్‌లకి కూడా నవ్వేసే వాళ్లు చాలా మందే వుండొచ్చు కానీ ఏడిపించడం సంగతి అటుంచి, కనీసం కదిలించాలన్నా కానీ బలమైన ఎమోషన్స్‌ పండాలి. అందుకే ఎమోషన్స్‌ మీద డిపెండ్‌ అయి తీసిన సినిమాలతో మెప్పించడానికి మరింతగా కష్టపడాలి.

'ఎమోషన్‌ సప్లయర్స్‌' కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆ ఎమోషనే తగినంత సప్లయ్‌ కాలేదు. 'ఆక్సిజన్‌' అనే గుజరాతీ చిత్రంలోని కాన్సెప్ట్‌ని తీసుకున్న 'శతమానం భవతి' దర్శకుడు వేగేశ్న సతీష్‌ ఇందులో కూడా అలాంటి యూనివర్సల్‌ ఎమోషన్‌ చూసినట్టున్నాడు. అయితే ఇందులో కథానాయకుడు తాలూకు ఎమోషన్‌తో, దానికి అతను ఎంచుకునే సొల్యూషన్‌తో ఎక్కువ మంది రిలేట్‌ కాలేరు, యాక్సెప్ట్‌ చేయలేరు. 'అద్దెకు బంధువులు/కుటుంబ సభ్యులు' అనే అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఎక్కడైనా కనిపిస్తే మీ ఇమ్మీడియట్‌ రియాక్షన్‌ ఏంటి? ఎగ్జాక్ట్‌లీ…! వినగానే 'నాన్సెన్స్‌' అనిపించే దానిని 'టచింగ్‌'గా చెప్పడానికి చాలా హృద్యమయిన సన్నివేశాలుండాలి. కానీ 'ఎంత మంచివాడవురా' కథానాయకుడు బాలు (కళ్యాణ్‌రామ్‌) తాలూకు 'అద్దె బంధువులు' అంతా ఆర్టిఫిషియల్‌ ఎమోషన్స్‌తో ఏమాత్రం కదిలించరు. ఇక ఈ సదరు అద్దెకు తీసుకున్న వారి స్పందనల్లో కూడా ఎక్కడా సహజత్వం వుండదు.

గుజరాతీ ఆక్సిజన్‌లోనే చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించే రీతిన రూపొందిన సన్నివేశాల్లో చాలా వాటిని వేగేశ్న సతీష్‌ అలాగే తర్జుమా చేసేసుకున్నాడు. కథానాయకుడు అలా బంధుత్వాలు పెట్టుకోవడానికి బలమైన కారణం అంటూ ముందు ఒక సుదీర్ఘమయిన ఛైల్డ్‌ ఎపిసోడ్‌ వేసినా కానీ జనం యాక్సెప్ట్‌ చేయాల్సిన సన్నివేశాల్లో మాత్రం గుజరాతీ వారి చోటా బడ్జెట్‌ సినిమాని తు.చ. తప్పకుండా ఫాలో అయ్యాడు. కమర్షియల్‌గా మార్చే క్రమంలో హీరోతో కొన్ని పంచ్‌ డైలాగులు, ఇసుక మాఫియా నడిపే ప్రతినాయకుడు, అవసరం లేని కొన్ని ఫైట్లు, ఒక ఐటెమ్‌ సాంగు వేసేసారు కానీ అదంతా ఓల్డ్‌ స్కూల్‌ తరహాలో సాగే అతి సాధారణ మిక్సింగ్‌ కార్యక్రమం.

సినిమా అంతటా ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా ఒకరి తర్వాత ఒకరితో బంధుత్వాలు కలుపుకోవడం, అది ఒక దగ్గర ఆగడం మాదిరిగా సాగుతుంది తప్ప ఎక్కడా స్మూత్‌ ఫ్లో వుండదు. ఈ ఎపిసోడ్ల వారీ కథనం వల్ల కథ ఎక్కడ మొదలయిందో అక్కడే వుందనే భావన వస్తుంటుంది. రిలీఫ్‌గా అడపాదడపా యూట్యూబ్‌ థంబ్‌నెయిల్స్‌పై వేసిన పంచ్‌లు పేలినా కానీ ఆ కామెడీ చాలా మితంగానే వుంది. ఇ.వి.వి. సత్యనారాయణ వద్ద చాలా చిత్రాలకి రచయితగా పని చేసిన వేగేశ్న సతీష్‌ ఇందులో హాస్యాన్ని అడపాదడపా పండించాడు. బహుశా 'శతమానం భవతి' హ్యాంగోవర్‌లో పడి తన బలాన్ని విస్మరించి నేల విడిచి ఎమోషనల్‌ సాము చేస్తున్నాడేమో చెక్‌ చేసుకోవాలి.

ఎన్నో రిలేషన్లున్న ఈ కథలో తనికెళ్ల భరణి తాలూకు ఎమోషన్‌ ఒకటీ కాస్త రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. అది కూడా ఎందుకంటే అతనికి నిజంగానే అతను తన కొడుకు అనే భావన కలిగించడం వలన. ఇలాంటి సహజమయిన ఎమోషన్స్‌ మిగతా చోట్ల కుదరక ఆ డ్రామా అంతా యాంత్రికంగా అనిపిస్తుంది. తనికెళ్ల భరణి ఎపిసోడ్‌లోనే విలన్‌గా రాజీవ్‌ కనకాల రావడంతో ట్రాక్‌ మీదకి వచ్చిన భావన కలుగుతుంది. కానీ అంతలోనే మళ్లీ యథాతథంగా 'అద్దెకు బంధువులు' స్కీమ్‌ రీస్టార్ట్‌ అయిపోయి, కేరళలో ఒక సుదీర్ఘమయిన, ఈ కథకి అసలు అవసరమే లేని ఎపిసోడ్‌తో విసుగు తారాస్థాయికి చేరిపోతుంది. ఇక 'వదిలేస్తే మంచిదిరా' అని బతిమాలుకునే లెవల్‌కి విసిగించేసినా కానీ మళ్లీ ఒక పరమ దండగ ఫైట్‌ సీన్‌కి తోడు, ఎలాగైనా ఏడిపించి తీరాలనే కసితో చేసినట్టున్న హాస్పిటల్‌ సీన్‌ ఎగ్జిట్‌ డోర్‌ వైపు వార్‌ జోన్‌లో వున్న దేశం నుంచి బయటకు పరుగులు తీసే శరణార్ధుల్లా పరుగెత్తేట్టు చేస్తాయి.

కళ్యాణ్‌రామ్‌ తనవంతు చేయగలిగింది చేసాడు కానీ ఇది తన జోన్‌ కాదు. మెహ్రీన్‌ గురించి కొత్తగా రాయడానికి ఏమీ లేదు. రాజీవ్‌ కనకాలకి విలన్‌ అనే పెద్ద పేరు పెట్టారు కానీ పాత్ర మాత్రం అన్ని సినిమాల్లో ఇచ్చిన లెంగ్తే ఇచ్చారు. వెన్నెల కిషోర్‌ నవ్వించడానికి బాగా ప్రయత్నించాడు. సుదర్శన్‌కి రాసిన యూట్యూబ్‌ పంచ్‌లు ఫర్వాలేదు. నరేష్‌, విజయ్‌కుమార్‌, ప్రవీణ్‌ తదితరులంతా సహాయక పాత్రల్లో కనిపించారు. తెరవెనుక నుంచి కూడా వేగేశ్న సతీష్‌ ఎవరి నుంచి గొప్ప అవుట్‌పుట్‌ తెచ్చుకోలేదు. గోపిసుందర్‌ పాటలు అంతంతమాత్రంగానే అనిపించగా, ఛాయాగ్రహణం ఓకే అనిపిస్తుంది.

సినిమా కంటే టీవీ సీరియల్‌ పోకడలు ఎక్కువ వున్న 'ఎంత మంచివాడవురా' స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌కి ఎక్కువ, సిల్వర్‌ స్క్రీన్‌కి తక్కువ అన్నట్టుగా వుంది. శ్రీకాంత్‌ అడ్డాల తీసిన 'బ్రహ్మూెత్సవం' తరహా కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం కలిగించే అనుభూతి కూడా ఇంచుమించు దానికి దగ్గరగానే వుంది.

బాటమ్‌ లైన్‌: ఇంత 'మంచి' వల్లకాదురా!

గణేష్‌ రావూరి