సంక్రాంతి….తెలుగువారి మొట్ట మొదటి పండగ. అందువల్లే కూతుళ్లు, అల్లుళ్లను మొదటి పండగకు తప్పకుండా పిలుచుకుంటారు. కారణాలేవైనా కృష్ణా జిల్లా అల్లుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ దఫా భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితో కలిసి తన అత్తగారి జిల్లాకు వెళ్లాడు.
ప్రతి ఏడాది నారా, నందమూరి కుటుంబాలు సంక్రాంతికి చంద్రబాబు స్వస్థలం చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. నారావారిపల్లెలోనే మూడు రోజులు ఆనందంగా గడిపేవాళ్లు. అయితే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమరావతి రాజధాని రైతులు ఆందోళనలో ఉన్నారు. వారికి సంఘీభావంగా చంద్రబాబునాయుడు తన భార్య, కోడలు, ఇతర కుటుంబ సభ్యులతో కలసి రాజధాని రైతుల వద్దకు వెళ్లారు.
ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ తన భార్య సంక్రాంతికి ప్రతి ఏడాది నారావారిపల్లెకు వెళ్లాలని ఒత్తిడి చేసేదని గుర్తు చేశాడు. కానీ ఈ సారి అమరావతి రైతులు సంతోషంగా లేరని, అందువల్లే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పలేనన్నాడు. ఏది ఏమైనా ఈ ఏడాది కృష్ణా జిల్లా అల్లుడు చంద్రబాబు సంక్రాంతిని అత్తగారి జిల్లాలో గడుపుతున్నాడు.