సందు సందుకూ చంద్ర‌బాబు!

కుప్పంలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు సందు సందూ తిరుగుతున్నారు! మూడు రోజుల వ్య‌వధిలో కుప్పం ప‌ర్య‌ట‌న‌ను చేప‌ట్టిన చంద్ర‌బాబు నాయుడు ప‌ల్లెల మీద ప‌డ్డారు. పంచాయ‌తీ స్థాయి కూడా లేని ప‌ల్లెల‌కు కూడా…

కుప్పంలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు సందు సందూ తిరుగుతున్నారు! మూడు రోజుల వ్య‌వధిలో కుప్పం ప‌ర్య‌ట‌న‌ను చేప‌ట్టిన చంద్ర‌బాబు నాయుడు ప‌ల్లెల మీద ప‌డ్డారు. పంచాయ‌తీ స్థాయి కూడా లేని ప‌ల్లెల‌కు కూడా వెళుతూ.. త‌న రాజ‌కీయ ఉనికిని కాపాడుకునేందుకు చంద్ర‌బాబు నాయుడు అప‌సోపాలు ప‌డుతున్న వైనం స్థానికంగా కూడా చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

ఎవ‌రో ఓడిపోయిన ఎమ్మెల్యే .. ప్ర‌తి ప‌ల్లెకూ తిరుగుతున్నాడంటేనే ప్ర‌జ‌లు లైట్ తీసుకుంటారు. ఓడిపోయిన వాడింతేలే అన్న‌ట్టుగా ఉంటుంది వ్య‌వ‌హారం. గ‌తంలో కొంద‌రు ఇలాంటి ఓడిపోయిన ఎమ్మెల్యేలు.. టీకొట్ల వ‌ద్ద‌కూ వెళ్లి, అక్క‌డ న‌లుగురైగురితో మాట్లాడి.. రాబోయే ఎన్నికల గురించి మాట్లాడుకునే వారు.  త‌న‌కు స‌హ‌కారం అందించాలంటూ విన్న‌వించేవారు. ఇలాంటి వారు మ‌రింతగా అభాసుపాల‌య్యే వారే త‌ప్ప‌, ఇలాంటి ఎత్తుగ‌డ‌లు అంత ఫ‌లించ‌వు!

2014 ఎన్నిక‌ల‌కు ముందు ఇలాగే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని గోదావ‌రి జిల్లాల్లో స్థానిక ఎన్నిక‌ల ప్ర‌చారానికి అంటూ తీసుకెళ్లి వీధివీధీ తిప్పారు స్థానిక నేత‌లు. అలాంటి ప్ర‌చారం ఎదురుత‌న్నింది.

అధినేత అంటే.. అత‌డికో స్థాయి ఉంటుంది. అధినేత ఒక ఊర్లో దిగుతున్నాడంటే… ఉండే హంగామే ఒక రేంజ్ లో ఉండాలి. వ‌చ్చిన దానికో అర్థం ఉండాలి. కుప్పం ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మాత్రం భిన్నంగా ఉంది. చెప్పిందే చెప్పి, ప్ర‌తి ఊర్లోనూ అదే రికార్డే వేసి, త‌న‌వైన ఊక‌దంపుడు ప్ర‌సంగాల‌తో చంద్ర‌బాబు నాయుడు చిరాకెత్తించేశారు.

ఎవ‌రో త‌న‌కు మోసం చేశార‌ని, అందుకే కుప్పం మున్సిపాలిటీలో ఓడిపోయిన‌ట్టుగా చెప్పుకుంటూ, ఓట‌ర్ల‌కు తాయిలాలు ప్ర‌క‌టిస్తూ.. ఇప్ప‌టి నుంచినే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న గెలుపు కోసం చంద్ర‌బాబు ప్ర‌యాస ప‌డుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని గెలిపించ‌డానికి ఏం చేయాలో, అది చేయాల్సిన చంద్ర‌బాబు నాయుడు, ఇలా కుప్పంలో ఎన్నిక‌ల‌కు రెండేళ్ల‌కు ముందే వీధివీధీ తిరుగుతూ.. విన్యాసాలు చేస్తున్నారు.

ఇదంతా కేవ‌లం త‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పం నుంచి పోటీ చేయ‌డం లేదు అని జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆపేందుకు చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నంగా తెలుస్తోంది. కానీ, ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు నుంచినే ఇలా సొంత నియోజ‌క‌వ‌ర్గంలో సీటు నిల‌బెట్టుకునేందుకు అప‌సోపాలు ప‌డుతున్న నేత‌గా మాత్రం చంద్ర‌బాబు ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే ప్ర‌త్యేకంగా నిలిచిపోతున్నారు!