ఈ మధ్యకాలంలో తండ్రీకొడుకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడులు ఒకేలా వాపోతూ ఉన్నారు. ఒకవైపు వీరు సానుభూతి కోరుకుంటున్నారు. మరోవైపు తమకు అధికారం ఇస్తే అంతు చూస్తామంటున్నారు! ఇంతకీ వీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో మరి! ఏపీలో తెలుగుదేశం క్యాడర్ పై దాడులు జరుగుతున్నాయని, తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ ఉన్నారని, తెలుగుదేశం నేతలపై కేసులు పెడుతున్నారని.. చంద్రబాబు నాయుడు, లోకేష్ లు వాపోతూ ఉన్నారు. ఒకవైపు వీరు ఈ విషయంలో సానుభూతిని ఆశిస్తున్నట్టుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని వాపోతున్నారు.
మరి అదే ప్రసంగంలో.. వీరు చెప్పే మాట ఏమిటంటే, తమ చేతికి మళ్లీ అధికారం వస్తే తాము ఇంతకింత చూపిస్తామంటూ చంద్రబాబు, లోకేష్ లు పోటాపోటీ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇన్నాళ్లూ లోకేష్ మాత్రమే ఈ కామెడీ హెచ్చరికలు చేసే వారు. తను తన తండ్రి చంద్రబాబు అంతటి మంచి వాడు కాదని… ఆయన మరిచిపోయినా తను మరిచిపోనంటూ లోకేష్ మైకుల ముందు గాంభీర్యాన్ని ప్రదర్శించే వారు. కక్ష సాధింపు చర్యలు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధించడం చేస్తామంటూ లోకేష్ బహిరంగ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు!
మరి తమ చేతికి మళ్లీ అధికారం వస్తే.. తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు నరకం చూపిస్తామన్నట్టుగా ప్రకటనలు చేస్తూ లోకేష్ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం చెబుతున్నట్టు? రాష్ట్ర ప్రజానీకానికి ఏం సందేశం ఇస్తున్నట్టు?
ఇక లోకేషే కాదు, చంద్రబాబు తీరు కూడా ఇదే! తమ చేతికి మళ్లీ అధికారం వస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను వేధిస్తామని చంద్రబాబు బహిరంగ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు! కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకే కాదు, చంద్రబాబు పోలీసులకూ ఇదే హెచ్చరిక చేస్తూ ఉన్నారు. పోలీసులు తమ వాళ్లను వేధిస్తున్నారని.. అందరి పేర్లనూ గుర్తుంచుకుంటున్నట్టుగా, మరిచిపోకుండా రాసుకుంటున్నట్టుగా.. చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారు! అంటే.. చంద్రబాబు, లోకేష్ లకు మళ్లీ అధికారం కావాల్సింది ఇలాంటి పనుల కోసమా? తమ వ్యవహారాలను చక్క పెట్టుకోవడానికి, తమ కార్యకర్తల రాజ్యానికి, తమ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకూ చంద్రబాబు, లోకేష్ లకు ఏపీలో అధికారం కావాలి కాబోలు!
మరి ఇదే సమయంలో.. వీరి చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏం చేశారనేది కూడా ప్రశ్నే! ఇప్పుడు తమ కార్యకర్తలపై వేధింపులు అంటున్న చంద్రబాబు, లోకేష్ లు.. తమ చేతిలో అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను తిప్పుకోవడానికి ఏం చేశారనేది అప్పుడే అంతా మరిచిపోయారని అనుకుంటున్నారా! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చేసుకుంటే.. ఆపార్టీ వీక్ అయిపోతుందని చంద్రబాబు భ్రమపడ్డారు. అందుకోసం అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీ నుంచి 23 మందిని కొనుక్కొన్నారు
కొందరికి డబ్బు, మరి కొందరికి మంత్రి పదవులు, ఇంకొందరికి కేసులు, బెదిరింపులు.. ఇలా సామదానబేదదండోపాయాలను ఉపయోగించి చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలనూ తన పార్టీలోకి అక్రమంగా చేర్చేసుకున్నారు! వారిపై అనర్హత వేటు వేయకుండానే ఐదేళ్లను గడిపేశారు! ఇలాంటి రాజకీయం చేసిన చంద్రబాబు నాయుడు.. ఎమ్మెల్యేల మీదే అలా వ్యవహరించిన చంద్రబాబు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పై ఎలా వ్యవహరించారో చెప్పనక్కర్లేదు.
తనను వ్యతిరించే వారిపై ఉక్కుపాదాన్ని మోపిన ఘనత చంద్రబాబుకు ఎప్పుడూ ఉంది. రాయలసీమ ప్రాంత పర్యటనకు వస్తే.. కర్నూలుకు హై కోర్టు కావాలన్న లాయర్లను నిర్భంధించిన ఘనత చంద్రబాబుది. వంద ఎలుకలు తిన్న పిల్ల కాశీ యాత్ర చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు ఇప్పుడు సానుభూతి కోరుకుంటున్నారు! అందరినీ వేధించి, కాల్చుకున్న చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు.. తమ వారిపై ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అంటున్నారు!
అయితే చంద్రబాబు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. నాయకుడు అనే వాడు ఎప్పుడూ సానుభూతిని ఆశించకూడదు. తనకు అధికారం ఇస్తే కొడతాను, కక్ష సాధిస్తాను అంటూ.. చెప్పుకునే వాడు నాయకుడే కాదు! తన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు తీసుకెళ్లినా జగన్ ఎప్పుడూ.. చంద్రబాబులా మాట్లాడలేదు. చూద్దాం.. అనే రీతిలో ఎదుర్కొన్నాడు కానీ, ఒకవైపు సానుభూతిని ఆశిస్తూ, మరోవైపు అధికారం ఇస్తే కక్ష సాధిస్తానంటూ ప్రగల్భాలు పలికే రాజకీయం మాత్రం చంద్రబాబుకే సొంతం లాగుంది!