ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం లో వీధివీధీ తిరుగుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండంగానే.. వచ్చేసారి తను ఎమ్మెల్యేగా నెగ్గడానికి చంద్రబాబు నాయుడు కుప్పం సందుల్లో సర్కస్ ఫీట్లు చేస్తున్నారు!
చంద్రబాబు విన్యాసాలను వీక్షిస్తుంటే.. ఇంతకీ బాలకృష్ణ ఎప్పుడు హిందూపురం వైపు చూస్తారో అనేది కూడా చర్చగా నిలుస్తోంది. కుప్పం ఎలాగైతే టీడీపీకి కంచుకోటో, హిందూపురం కూడా టీడీపీకి అలాంటి కంచుకోటే. అయితే… హిందూపురం పరిధిలో కూడా మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడింది.
టీడీపీ గతంలో అధికారంలో లేని సమయంలో కూడా హిందూపురం మున్సిపాలిటీని ఆ పార్టీ నిలుపుకునేది. ఉనికిని గట్టిగా చాటుకునేది. అయితే బాలకృష్ణ గత ఎన్నికల్లో హిందూపురం నుంచి నెగ్గినా.. ఇటీవలి మున్సిపల్, ఇతర స్థానిక ఎన్నికల్లో మాత్రం టీడీపీని విజేతగా నిలపలేకపోయారు.
ఇక ఎమ్మెల్యేగా బాలకృష్ణ పనితీరు గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిది. అధికారంలో ఉన్నప్పుడైతే అడపాదడపా అయినా హిందూపురం వెళ్లి హల్చల్ చేసే వారు. మందీమార్బలాన్ని పెట్టుకుని బైకు తోలుతూ, ఎద్దులబండి తోలుతూ.. బాలకృష్ణ సర్కస్ ఫీట్లు చేసే వారు. అయితే ఇప్పుడు అధికారం కూడా లేకపోవడంతో బాలకృష్ణ హిందూపురం వైపు వెళ్లడం మరీ తక్కువైపోయినట్టుగా ఉంది.
సినిమాలతో, ఓటీటీ షోలతో బాలకృష్ణ చాలా బిజీగా ఉన్నారు. తను ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మరిచినట్టుగా ఉన్నారు. చంద్రబాబే రెండేళ్ల ముందు హడావుడి మొదలుపెట్టిన నేపథ్యంలో, బాలకృష్ణ కూడా తన బావను ఫాలో అవుతారేమో. అయితే బాలకృష్ణకు ఉన్న సానుకూలత ఏమిటంటే.. హిందూపురంలో ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు స్పష్టంగా ఉన్నాయి.
ఈ నియోజకవర్గం బాధ్యతలను ఎవరో ఒకరికి స్పష్టంగా అప్పగించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండటం.. వచ్చే ఎన్నికల్లో కూడా బాలకృష్ణకు సానుకూల అంశమే కావొచ్చు!