కొత్త సంవత్సరం వచ్చింది. కొత్తగా సవాళ్లను తెచ్చింది. మనుగడే ఇప్పుడు మనిషికి పెద్ద సవాల్ గా మారింది. ప్రత్యేకించి రెండేళ్ల కిందట మానవాళి జీవితాన్ని ప్రభావితం చేయడం మొదలుపెట్టిన కరోనా వైరస్.. కొత్త సంవత్సరంలో కొత్త సవాళ్లను విసురుతోంది తప్ప, వెనక్కు తగ్గుతున్నట్టుగా లేదు. కరోనా మాత్రమే కాదు… మనిషి జీవితాన్ని కాంప్లికేట్ చేసే వ్యవహారాలు ఎన్నో మనుషుల మధ్యనే ఉన్నాయి!
ఇలాంటి నేపథ్యంలో… కొన్నింటిని వదిలించుకోవడం, మరి కొన్నింటిని అలవాటు చేసుకోవడం కూడా చాలా ముఖ్యంగా మారింది. ఈ అలవాట్లను పాటించకపోవడం వల్ల.. జరిగే నష్టం ఎంత? అనే విషయాన్ని ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేరేమో కానీ, ఈ అలవాట్లను అలవరుచుకోవడం వల్ల మాత్రం ఎంతో ఉపయోగం ఉంది. వీటి వల్ల కలిగే లాభాలను చాలా త్వరగా.. స్వయంగా అనుభవించవచ్చు. అలా జీవితాన్నే మార్చేసే అలవాట్లు ఏమిటంటే!
వ్యాయామం..
మొదటి రోజు ఉత్సాహం ఉండవచ్చు. రెండో రోజు మళ్లీ బద్ధకం రావొచ్చు. వ్యాయమం చేయడం విషయంలో చాలా అడ్డంకులు ఏర్పడవచ్చు. ప్రత్యేకించి శరీరం సహకరించకపోవడమే పెద్ద అడ్డంకి. మజ్జుగా ఉండటం అలవాటు కావడంతో.. వ్యాయామం అంటే ఎంతో కష్టం అనిపించవచ్చు. అయితే కొన్ని రోజుల పాటు అలవాటైతే.. ఎక్సర్ సైజ్ లో ఉంటే మజా అర్థం అవుతుంది. మన మీద మనకే ప్రేమను పెంచగల సాధనం వ్యాయామం.
కొందరికి బద్ధకంగా ఉండటమే తమ మీద తమకున్న ప్రేమకు తార్కాణం కావొచ్చు. అయితే.. వ్యాయామం చేయడం అలవాటైతే.. లైఫ్ స్టైలే మారిపోతుంది. వ్యాయామంతో శరీరం ఉదయమే అలసిపోయినా.. ఆ తర్వాత వచ్చే కొత్త శక్తి మాత్రం కొలవలేనిది. రోజువారీ జీవితంలో ఎదురయ్యే డిజప్పాయింట్ మెంట్ల నెగిటివిటీని కూడా తగ్గించగల సాధనం వ్యాయామం! ఏదో చుట్టం చూపుగా కాకుండా.. ప్రతి రోజూ ఎక్సర్సైజ్ విషయంలో ఒక చూపు చూడగలిగితే.. జీవితంలో సానుకూల మార్పు మొదలైనట్టే.
సోషల్ మీడియాకు దూరంగా..!
ఎప్పుడొచ్చింది ఈ సోషల్ మీడియా.. ఒక దశాబ్దం కిందట చాలా మందికి చేరువయ్యింది. ఇప్పుడు ఫేస్ బుక్ లో, ఇన్ స్టాలో, యూట్యూబ్ వీడియోలతో కాలక్షేపం చేసే మనమంతా పదేళ్ల కిందట ఏం చేసే వాళ్లం? వినోదం కోసం, ఖాళీ సమయాల్లో ఏం చేసే వాళ్లమో.. కాస్త గుర్తుకు తెచ్చుకోవాలి! సోషల్ మీడియా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉండవచ్చు. కానీ.. అతిగా సోషల్ మీడియాకు అతుక్కుపోవడం మాత్రం ఏ మాత్రం ప్రొడక్టివిటీని ఇవ్వని వర్కే!
సోషల్ మీడియాను తమ వ్యాపార సాధనంగా మార్చుకోవడం ఒక ఎత్తు, ఇదే సోషల్ మీడియాను ఎంతసేపూ వినోదంగా చూడటం మరో ఎత్తు. ఫస్ట్ కేటగిరి జనాలు .. ట్రెండ్ ను క్యాష్ చేసుకుంటూ ఉంటే, రెండో కేటగిరి జనాలు.. ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టు. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నందు వల్ల వచ్చే నష్టం మాత్రం ఉండదు. మరీ అస్సలు టచ్ చేయకుండా ఉండకున్నా, విపరీతంగా ఇదే పని పెట్టుకోవడాన్ని అపితే మాత్రం కచ్చితంగా మంచిదే!
ఆహారపు అలవాట్లను మార్చుకోవడం!
మరీ సాధువుల్లా మారిపోమని చెప్పడం లేదు. అయితే.. మన శరీరం పై ఆహారం ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంది, ఏం తినాలి, ఏం మానేయాలి.. అనే అంశాల గురించి స్వీయ సమీక్ష అవసరం. మన బాడీకి ఏం పడుతుందో.. గుర్తించుకోవడం పెద్ద కష్టం కాదు. ఏదైతే మనకు పడటం లేదో.. దాన్ని తినడాన్నిఆపేయడం ఉత్తమ మార్గమే అని వైద్యులు కూడా చెబుతూ ఉన్నారు. షుగర్ కంటెంట్ కు దూరంగా ఉండటాన్ని అలవరుచుకోమంటున్నారు. మరీ నోరు కట్టేసుకోనక్కర్లేదు. అయితే… ఇష్టమైన దాన్ని, తినితీరాలనే తపనను మితంగా మార్చుకోవడం నిజంగా చాలా మంచి అలవాటే.
పరిసరాల శుభ్రత!
ఇది పాత పాఠమే. ముందుగా మీ రూమ్ తో మొదలుపెట్టుకోండి. ఆ తర్వాత ఇల్లు, ఆ తర్వాత ఇంటి ఆవరణ.. వరకూ అయినా శుభ్రంగా ఉంచుకోవడం నిజంగా చాలా గొప్ప అలవాటు. నీట్ గా సర్ది ఉన్న రూమ్ కూ, దేన్ని పడితే దాన్ని ఎక్కడంటే అక్కడ పడేసి ఉన్న రూమ్ కూ చాలా తేడా ఉన్నట్టే, ఈ పరిసరాల్లోని జీవన శైలిలో కూడా చాలా తేడా ఉంటుంది.