విశాఖ జిల్లా ఇపుడు కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత వారం దాకా కేవలం యాభై లోపు కరోనా కేసులు వచ్చేవి. ఇపుడు అవి రోజు వారీగా చూస్తే రెండు వందల పైదాటుతున్నాయి. మరో వైపు చూస్తే డైలీ ప్రజా సేవలో ఉండే ఉన్నతాధికారులు సైతం కరోనా బారిన వరసగా పడుతున్నారు.
మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ లక్ష్మీషా కరోనా బారిన పడడంతో జీవీఎంసీలో కలకలం రేగింది. ఆయన ఒక్కరే కాదు, ప్రజారోగ్యం చూస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్ తిరుపతిరావుకు కూడా కరోనా రెండవ సారి సోకడం ఆ మహమ్మారి డేంజరస్ కండిషన్ ని తెలియచేస్తోంది.
ఇక విశాఖ సిటీలోని గోపాలపట్నం సీఐ అప్పారావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో పోలీస్ వర్గాలు ఉలిక్కిపడుతున్నాయి. ఇలా కేవలం ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే అధికారులు అంతా కరోనా బారిన పడడంతో నగర ప్రజానీకం కూడా వణుకుతున్నారు.
మరో వైపు ఒమిక్రాన్ కేసులు కూడా జిల్లాలో కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో కరోనా కేసులు మళ్లీ పూర్వపు స్థాయిలో విశాఖలో పెద్ద ఎత్తున వస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకో వైపు చూస్తే విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున బయటకు వచ్చి మరీ కరోనా మీద జనాలను హెచ్చరిస్తూ ప్రత్యేక డ్రైవ్ ని నిర్వహించారు.
ఆయన బీచ్ వంటి ప్రాంతాలకు కూడా వెళ్లి సందర్శకులకు మాస్క్ మస్ట్ అంటూ సూచించడమే కాదు, అలా పెట్టుకోని వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇక మీదట మాస్కులు ధరించని వారి మీద పోలీసులు కూడా గట్టి హెచ్చరికలు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి సంక్రాంతి పండుగతో విశాఖ రద్దీగా ఉంటే కరోనా భూతం ఏకంగా కమ్ముకుని వస్తోంది. ఇదే తీరున సాగితే పండుగ కంటే ముందే విశాఖ సిటీ ఆంక్షల చట్రంలోకి పోతుంది అని అంటున్నారు.