ఇలా తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిందో లేదో అలా రకుల్ పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నెలలోనే ఆమె పెళ్లి చేసుకుంటుందని కొన్ని మీడియా సంస్థలు రాయగా.. మరికొన్ని మీడియా సంస్థలు ఆమె ఇప్పటికే పెళ్లి చేసుకుందని రాసేశాయి. దీనిపై రకుల్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
తానింకా జాకీ భగ్నానీ ప్రేమనే పూర్తిస్థాయిలో ఆస్వాదించలేదని, అప్పుడే పెళ్లి ఏంటంటూ మండిపడింది. ప్రేమ విషయాన్ని ఎలాగైతే తను స్వయంగా వెల్లడించిందో.. అలానే పెళ్లి విషయాన్ని కూడా స్వయంగా వెల్లడిస్తానని క్లారిటీ ఇచ్చింది. మరీ ముఖ్యంగా మీడియాకు సమాచారం ఇచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని కూడా స్పష్టతనిచ్చింది.
ప్రస్తుతం తన చేతిలో 10 సినిమాలున్నాయని… దయచేసి పెళ్లిపై రూమర్స్ సృష్టించి తనను డిస్టర్బ్ చేయొద్దని కోరుతోంది రకుల్. ఈ సందర్భంగా జాకీకి, తనకు మధ్య బాగా కనెక్ట్ అయిన విషయాల్ని కూడా బయటపెట్టింది.
“మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం. కుటుంబం, పని, బంధువులకు మేమిద్దరం ఇచ్చే ప్రాధాన్యత ఒకేలా ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, ఉదయాన్నే ఇద్దరం వర్కవుట్స్ చేయడాన్ని ఇష్టపడతాం. మా ఇద్దరికీ ఆరోగ్యకరంగా తినడం ఇష్టం. అందుకేనేమో మేం బాగా కనెక్ట్ అయ్యాం.”
ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ పై ఎక్కువగా దృష్టిపెట్టింది. ఆమె నటించిన 4 హిందీ సినిమాలు ఈ ఏడాది విడుదలకు సిద్ధమయ్యాయి. వీటిలో 2 సినిమాలు కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడ్డాయి.