సోనూ సూద్ పంజాబ్ రాష్ట్రానికి అధికారిక ప్రతినిధిగా ఉన్నారు. పంజాబ్ స్టేట్ ఐకాన్ గా ఆయనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గుర్తుంపునిచ్చింది. ప్రభుత్వం తరపున కొన్ని ప్రచార కార్యక్రమాలకు తమ ప్రతినిధిగా ఆయన సేవలను ఉపయోగించుకుంటోంది. అయితే ఈ స్టేట్ ఐకాన్ అనే పదవికి సోనూ రాజీనామా చేశారు. తానిక ఆ పదవిలో ఉండలేనని చెప్పారు.
కారణం ఆయన సోదరి మాళవిక సూద్ పంజాబ్ ఎన్నికల బరిలో నిలవడమే. మోగా స్థానం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే 1000 సైకిళ్లను విద్యార్థినులకు పంచి పెట్టారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్ర ప్రతినిధిగా ఉండటం సరికాదని విరమించుకున్నారు. మాళవిక ప్రస్తుతానికి ఏ పార్టీకి అనుబంధంగా లేరు. సొంతంగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే సైకిళ్ల పంపిణీ వంటి కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నారు.
మాళవిక తరపున సోనూ సూద్ కూడా ప్రచార కార్యక్రమాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా మోగాలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు విద్యార్థినులకు వెయ్యి సైకిళ్లను పంపిణీ చేశారు. మిగతా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలిస్తే స్కూటర్లు ఇస్తాం, సెల్ ఫోన్లు ఇస్తామని చెబుతున్నా.. సోనూ సూద్ సోదరి మాత్రం ఎన్నికలకు ముందే సైకిళ్లు ఇచ్చేసింది, స్థానికుల మనసులు గెలుచుకుంది.
ఈ క్రమంలో పంజాబ్ స్టేట్ ఐకాన్ గా ఉన్న సోనూ సూద్ పై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులందాయి. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా సోనూ సూద్ వివరణ కోరినట్టు సమాచారం. దీంతో సోనూ స్వచ్ఛందంగా ఐకాన్ అనే పదవి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఎన్నికల కమిషన్, తాను సమన్వయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు సోనూ సూద్.
పార్టీలకు లొంగిపోకూడదనే..
లాక్ డౌన్ టైమ్ లో హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్ ని చేర్చుకోడానికి దాదాపుగా అన్ని పార్టీలు గేలమేశాయి. కానీ తెలివిగా సోనూ ఏ గాలానికీ చిక్కలేదు. అలా అని తను నేరుగా పోటీ చేయడం లేదు కూడా. తన సోదరి మాళవిక తరపున మాత్రం ప్రచారానికి వెళ్తున్నారు. మాళవిక కూడా పార్టీలను పక్కనపెట్టారు. సోలోగా ఎంట్రీ ఉండాలనుకుంటున్నారు.
పంజాబ్ లో ప్రస్తుతం రైతులే కొత్త ప్రభుత్వాన్ని నిర్ణయించే శక్తిగా ఎదిగారు. ఈ క్రమంలో మోగా నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నా కూడా సోనూ సూద్ సోదరికి విజయావకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి. సోషల్ మీడియా క్రేజ్ బ్యాలెట్ బాక్స్ వరకు వచ్చి, ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందో లేదో.. మాళవిక విజయంతో తేలిపోతుంది.