ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో గుర్తించుకోదగ్గ గొప్ప నిర్ణయం గ్రామ సచివాలయ వ్యవస్థ నెలకొల్పడం. పాలనను ప్రజల చెంతకే తీసుకెళ్లేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పుణ్యమా అని ఏపీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, లక్ష మందికి పైగా శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. అలాగే నాలుగు లక్షల మందికి పైగా వాలంటీర్లను నియమించి ప్రజల వద్దకే గాంధీజీ కలలుకన్న గ్రామస్వరాజ్యాన్ని తీసుకెళ్లారు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది.
సీఎం మానస పుత్రికగా చెప్పుకునే సచివాలయ వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగులకు తాజా పీఆర్సీ అమల్లో తీవ్ర అన్యాయం జరిగిందనే వాదన తెరపైకి వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పూర్తయి మూడు నెలలు కావస్తోంది. అయినా ఇంతవరకూ వారిని రెగ్యులరైజ్ చేయకపోవడంతో పాటు జూన్ నుంచి నూతన పీఆర్సీని అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
తన మానస పుత్రిక వ్యవస్థగా చెప్పుకునే సీఎం, లబ్ధి కలిగించడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని సచివాలయ ఉద్యో గులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం పీఆర్సీ అమల్లో జాప్యం చేయడం వల్ల తాము ఒక పీఆర్సీని నష్టపోతామని, అలాగే రూ.15 వేలతో ఇంకెంత కాలం బతుకీడ్చాలనే ప్రశ్నలు వారి నుంచి వెల్లువెత్తుతున్నాయి.
రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ అమలు, ఆ తర్వాత ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంతో పాటు జీతాలు కూడా పెంచుతామని అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తమ ఒక్కరి విషయంలోనే సీఎం ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని వారు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.
తనకు తానుగా తీసుకొచ్చిన నూతన వ్యవస్థకు సంబంధించి ఉద్యోగుల కంట కన్నీళ్లు పెట్టించడం ప్రభుత్వానికి మంచిది కాదు. వాళ్ల విషయంలో మరోసారి ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.