నారా లోకేశ్ పాదయాత్ర ఉన్నట్టా? లేనట్టా? ఆయన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దాదాపు 50 రోజులకు లోకేశ్ పాదయాత్ర చేరుకుంది. ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో లోకేశ్ అడుగు పెట్టబోతున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మూడురోజుల పాటు పాదయాత్రకు సెలవు ప్రకటించారు. అనంతరం ఇవాళ పాదయాత్ర పునఃప్రారంభం కానుంది.
లోకేశ్ యువగళం పాదయాత్ర 600 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాలను టీడీపీ గెలుచుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. అదేంటో కానీ, ఆ పాజిటివ్ ఎఫెక్ట్ లోకేశ్ పాదయాత్ర మీద పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు పాదయాత్ర ఉందా? అనే అనుమానం కలిగేలా లోకేశ్ నడక సాగుతోంది. లోకేశ్ పాదయాత్ర మొదటి రోజు మినహాయించి, మిగిలిన కాలమంతా డల్‌గా సాగుతోంది.
పాదయాత్రను చివరికి సొంత వాళ్లే పట్టించుకోని పరిస్థితి. లోకేశ్ గురించి అసలు మాట్లాడుకునే వాళ్లే కరువయ్యారు. పాదయాత్ర ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆయన విమర్శలకు ఎల్లో మీడియా కూడా ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం. పాదయా త్రకు సంబంధించి ప్రచారం కూడా అసలు జరగడం లేదు. ఏదో మొక్కుబడిగా పాదయాత్ర సాగుతున్న భావన ప్రతి ఒక్కరిలో వుంది.
పాదయాత్ర గురించి సంబంధిత జిల్లా వారికి తప్ప, మరొకరికి తెలిసే అవకాశం లేకుండా పోయింది. దీన్ని బట్టి పాదయాత్రకు ఎలాంటి స్పందనా లేదని అర్థం చేసుకోవచ్చు.