రాహుల్ పై అనర్హత వేటు పడితే రచ్చ ఎందుకు?

ప్రధాని నరేంద్రమోడీ ఇంటి పేరు గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు పరువు నష్టం దావా రూపంలో నమోదు అయింది. సూరత్ కోర్టులో వాదప్రతివాదాల సమయంలోనే తాను…

ప్రధాని నరేంద్రమోడీ ఇంటి పేరు గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు పరువు నష్టం దావా రూపంలో నమోదు అయింది. సూరత్ కోర్టులో వాదప్రతివాదాల సమయంలోనే తాను అన్న వ్యాఖ్యలు ఏ రకంగా పరువునష్టం ఉద్దేశంతో చేసినవి కాదో, నేరం కింద పరిగణించాల్సిన అవసరం లేదో రాహుల్ గాంధీ తన న్యాయవాదుల ద్వారా సమర్థంగా చెప్పుకుని ఉంటే సరిపోయేది. కానీ ఆయన ఆ పని చేయలేదు.

బహుశా, సూరత్ కోర్టులో రాహుల్ వాదనలు గట్టిగా వినిపించి ఉంటే రెండేళ్ల జైలు శిక్ష పడే తీర్పు వెలువడకుండా ఉంటే గనుక.. ఇవాళ ఈ పరిణామాలు ఉండేవి కాదు. ‘‘భారత ప్రజల వాణిని వినిపించేందుకు నేను పోరాడుతున్నాను.. ఎంత మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను’’ లాంటి నాటకీయ డైలాగులు కొట్టడానికి రాహుల్ కు అవకాశం దక్కేది కాదు. 

తన మీద పడే రాళ్లను కూడా ఏరి, తన చుట్టూ దుర్గంగా నిర్మించుకోవడానికి తెలివైన వాడు ప్రయత్నిస్తాడని పర్సనాలిటీ డెవలప్మెంటు క్లాసుల్లో చెబుతూ ఉంటారు. ఈ రకంగా.. తమ అవినీతి గురించి, తమ తప్పుల గురించి ప్రత్యర్థులు చెడామడా చేసే విమర్శలను కూడా ఎడ్వాంటేజీగా మార్చుకుని, రాజకీయ ఎడ్వాంటేజీ పొందడంలో రాజకీయ నాయకులను మించిన మహానుభావులు మరొకరు ఉండరు. ఇప్పుడు రాహుల్ చేస్తున్నది కూడా అదే. 

రెండేళ్ల జైలుశిక్ష నేపథ్యంలో, ఆయన మీద కోర్టు తీర్పు వచ్చిన తేదీనుంచే ఎంపీగా అనర్హత వేటు వేస్తూ పార్లమెంటు ఇచ్చిన ఆదేశాలు అక్రమమైనవి కాదు. కానీ వాటిని తమ పొలిటిల్ మైలేజీ కోసం వాడుకునే పనిలో కాంగ్రెస్ చాలా బిజీగా గడుపుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి ఇంత రచ్చ చేసే అవసరమే లేదు. కరెక్టు కూడా కాదు. 

రాహుల్ అనర్హత వేటును తప్పించుకోవడానికి ఇంకా సకల అవకాశాలు ఉన్నాయి. అన్ని మార్గాలు ఓపెన్ గానే ఉన్నాయి. పైకోర్టును ఆశ్రయించి సూరత్ కోర్టు తీర్పుపై స్టే తీసుకురాగలిగితే చాలు.. ఈ అనర్హత తొలగిపోతుంది. ఆయన మళ్లీ యథావిధిగా పార్లమెంటుకు వెళ్లి మోడీ సర్కారు మీద మరింత పదునుగా నిప్పులు చెరగడంలో నిమగ్నం అయిపోవచ్చు. 

అలాంటి పని చేయకుండా.. ఎటూ అనర్హత వేటు పడింది కదా.. దీనినించి వీలైనంత మైలేజీని పిండుకుందాం అని తపన పడుతున్నట్లుగానే ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి.