జ‌గన్ ఓటమి జ‌గన్ దే

కాంగ్రెస్ ను ఎవరో ఓడించనక్కరలేదు. ఆ పార్టీ వాళ్లే ఓడిస్తారు. అది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అలాగే వైఎస్ జ‌గన్ ను జ‌నం గెలిపించి వుండొచ్చు. కానీ ఓటమి కి మాత్రం జ‌నం…

కాంగ్రెస్ ను ఎవరో ఓడించనక్కరలేదు. ఆ పార్టీ వాళ్లే ఓడిస్తారు. అది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అలాగే వైఎస్ జ‌గన్ ను జ‌నం గెలిపించి వుండొచ్చు. కానీ ఓటమి కి మాత్రం జ‌నం కాదు కారణం. కేవలం జగన్ మాత్రమే.

ప్రేమ..అభిమానం అనేవి కొన్నాళ్లు, కొంత వరకు బంధాలను కట్టి వుంచుతాయి కానీ భయం మాత్రం కాదు. భయం అనేది అధికారం ఉన్నంత కాలమే వుంటుంది. అదే అధికారం చేజారుతుంది అని తెలిసినపుడు ఇక వుండమన్నా వుండదు. 

జ‌గన్ చేసిన తప్పిదం ఎవరి పట్ల తన అభిప్రాయాలు, అభిమానాలు ఏ మేరకు అన్నది ముందే ఫుల్ క్లారిటీ ఇచ్చేయడం. అస్సలు మొహమాటం లేకుండా, రాజ‌కీయ ఆలోచనలు లేకుండా, ముందు చూపు మరిచిపోయి, నిర్మొహమాటంగా వ్యవహరించడం. దాంతో ఏమవుతుంది. అవకాశం వున్నవాడు అండగా వుండాలనుకుంటాడు. అవకాశం ఇక లేదు అని తెలిసిపోయిన వాడు వేరే దారులు వెదుక్కుంటాడు. నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జ‌రిగింది అదే. ఇంకా ఇప్పుడేం వుంది. ముందుంది ముసళ్ల పండగ.

జ‌గన్ పాలన మూడు విధాలుగా సాగి ఉంటే తెలుగుదేశం, జ‌నసేనలకు ముచ్చెమటలు పట్టి వుండేవి 2024 నాటికి. కానీ జ‌గన్ పాలన ఒక విధంగానే సాగుతోంది. ఎలా సాగాలి.

1. జనాలకు నేరుగా డబ్బులు వేయడం

2.  జ‌నాల కళ్ల ముందు ఏదో ఒక డెవలప్ మెంట్ కనిపించడం

3.  నాకు మీరు..మీకు నేను అనే భావనను తన పార్టీ ప్రతినిధుల్లో కలిగించగలగడం.

ఈ మూడింటిలో కేవలం జ‌నాలకు నేరుగా డబ్బులు అందించడంలో నూరు శాతం విజ‌యం సాధించారు. కానీ ఇక్కడే మరో విషయం విస్మరించారు. వంద మందిలో పది మందికి సాయం చేస్తుంటే మిగిలిన తొంభై మందికి సహజంగా అసూయ వస్తుంది. మాకేంటీ? అనే భావన వస్తుంది. ముఖ్యంగా ఈ దేశంలో, రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజ‌లు నలిగిపోతున్నారు. కోవిడ్ తరువాత ధరలు దేశం అంతటా అమాంతం పెరిగిపోయాయి. ముక్కు పిండి మరీ ఇన్ కమ్ టాక్స్ వసూలు చేస్తున్నారు. మధ్యతరగతి జీవులకు అస్సలు వెసులు బాటు లేదు. 

ఇలా ఓ పక్కన మండి పోతూ వుంటే జ‌గన్ అప్పులు చేసి మరీ జ‌నాలకు పంచేస్తూ వుంటే ఎలావుంటుంది..మరింత మండిపోదూ. ఇప్పుడు అదంతా నెగిటివిటీగా మారదూ?

పోనీ డబ్బులు అందుకున్న వారు ఓటేస్తారు అని గ్యారంటీ వుంది అనుకుందాం. కేవలం వాళ్ల ఓట్లతో గట్టెక్కేస్తారా? లేదుగా. మరింకేం చేయాలి. డబ్బులు పంచడం ఆపేయాలా? అక్కరలేదు. మధ్యతరగతి వారి ఆలోచనలు కూడా గ్రహించాలి. వారికి డబ్బులు ఇవ్వకపోయినా అభివృధ్ది అనేది కళ్ల ముందు కట్టేలా చేస్తే, సర్లే బాగానే చేస్తున్నాడు అని కనికరిస్తారు. కానీ అదీ లేదే?

స్కూళ్లు, ఆసుపత్రులు బాగు చేసారు. కానీ అవేమీ మధ్యతరగతి కి పట్టేవి కాదు. వీరికి పట్టేవి రోడ్లు, పట్టణాల సుందరీకరణ, ఇలాంటివి. బాబు హయాంలో నందిగామ దాటిన దగ్గర నుంచి గన్నవరం వరకు ఎల్ఇడి వీధి దీపాల వరుస రాత్రి వేళ ఓ నెక్లెస్ మాదిరిగా కనిపించేది. ఇప్పుడు వెళ్లి చూడండి. సగం వెలగవు. అదే విధంగా అదే లైన్ లో బ్యూటిఫికేషన్.. గ్రీనరీ చాలా బాగుంటేది. ఇప్పుడు కటింగ్ చేయని చింపిరి జుత్తు మాదిరిగా తయారైంది. ఇది చాలా చిన్న విషయం. దీనికి జ‌గన్ ఏం చేస్తారు అని అనుకోవచ్చు. అధికారులను క్రమ శిక్షణలో పెట్టలేకపోవడం జ‌గన్ తప్పదమే కదా?

13 జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసారు. చకచకా నిర్మించి వుంటే ఎలా వుండేది? పట్టుమని రెండు మూడు కూడా నిర్మించలేకపోయారు. తెలంగాణలో చూడండి. సెకెండ్ గ్రేడ్ పట్టణాలన్నింటిలో మాంచి మాంచి పార్కులు నిర్మించారు. హైదరాబాద్ లో ఎక్కడ ట్రాఫిక్ సమస్య వుంటే అక్కడ ఫ్లయ్ ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించారు. జ‌నాలకు ఇలా కనిపించాలి ప్రభుత్వం ఏం చేస్తోంది అన్నది జ‌గన్ పాలనలో కరువైంది అదే.

ఇక పార్టీ సంగతి చూస్తే విజ‌యసాయి..సుబ్బారెడ్డి, సజ్జ‌ల‌ నడుమ మ్యూజిక్ చైర్స్ గేమ్ ఆడేసారు. దాంతో వాళ్లలో వాళ్లకి పడకుండా పోయింది. పార్టీ జ‌నాలు ముగ్గురి వెనుక సద్దుకున్నారు. ఎమ్మెల్యేలు.. మంత్రులు మూడు ముక్కలయ్యారు. పైకి ఒక్కటిగా కనిపిస్తున్న ఎవరి వెనుక ఎవరు గోతులు తవ్వుతున్నారన్నది పార్టీలో జ‌నాలకు ఎరుకే..ఒక్క జ‌గన్ కు తప్ప. విశాఖలో విజ‌యసాయి ఓ వర్గాన్ని ముప్పుతిప్పలు పెట్టినన్నాళ్లు పెట్టారు. అదే వర్గం ప్లస్ పార్టీలో కొందరు కలిసి విజ‌యసాయి మీద ఎంత చేయాలో అంతా చేసారు. దాంతో విజ‌యసాయిని మార్చి సుబ్బారెడ్డిని తెచ్చారు. ఇప్పుడు అంతా క్యాష్ అండ్ కారీ అనే గ్యాసిప్ లు మొదలయ్యాయి. దాంతో తమ వాటా రాని వాళ్లు నిట్టూర్చి ఇన్ యాక్టివ్ అయిపోతున్నారు.

మంత్రులను రెండున్నరేళ్లకు మార్చడం అన్నది మంచి పద్దతే. కానీ రాజ‌కీయాల్లో ఇది అంత అద్భుతమైన ప్రయోగం కాదు. విడతలు విడతలుగా మార్చుకుంటూ వెళ్లాలి ఇక ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పట్లో మంత్రులు కాలేం మరి అని మాజీలు, మిగిలిన ఎమ్మెల్యేలు ఫిక్స్ అయ్యారు. అయిదేళ్లలో సంపాదించే అవకాశాలు లేవు. ఎందుకంటే నిధులు విడుదలే లేదు కదా? నిదుల విడుదల అంటూ వుంటే ఎంతొ కొంత సంపాదన వుంటుంది. ఇక ఇలాంటపుడు జ‌గన్ ను నమ్ముకుని ఎందుకు వుండాలి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వంత డబ్బు ఎందుకు తీయాలి? ఓటర్లను ఎందుకు నమోదు చేయించాలి? నచ్చకపోతే చాలు జ‌గన్ పక్కన పెట్టేస్తారు అనే భావన పెరిగింది. దాంతో పార్టీ మీద అభిమానం, ఆధారం బదులు నిరాసక్తత పెరిగింది. ఎలా అయితే అలాగే అవుతుందనే భావనం మొదలైంది. అది చాలు క్యాన్సర్ మాదిరగా పార్టీని తినేయడానికి.

వీటన్నింటికీ కారణం జ‌గన్ తప్ప వేరు కాదు. ఎవరైనా అలిగినా, దూరంగా వుండిపోయినా పిలిచి బుజ్జ‌గించాలి తప్ప పోతే పో…అన్నట్లు వదిలేసి, మరింత దూరం చేసుకోవడం కాదు. ఇది అస్సలు తెలివైన రాజ‌కీయ వేత్త చేసే పని కాదు. ఇలా వదులుకుంటూ పోతే పార్టీని నమ్ముకున్న వారు ఎందరు వుంటారో? ఓడించాలనుకునేవారు అంతే మంది వుంటారు.

ఇవన్నీ కలిపి చెప్పేది ఒక్కటే కాంగ్రెస్ పార్టీని నాయకులు ఓడిస్తే, వైకాపాను జ‌గన్ నే ఓడించుకుంటున్నారు. తను ఇస్తున్న డబ్బులకు తలవొగ్గి జ‌నం తనకు ఓటేస్తే చాలు..వీళ్లతో పనేంటీ అనుకుంటున్నారు. కానీ పోలింగ్ మేనేజ్‌ మెంట్ చేయాల్సింది నాయకులే..ఓటర్లుకాదు. ఆ సంగతి గమనించకుంటే ఎలా? డబ్బులు అందుకుంటున్నవారికి తెలుసు. 

రేపు చంద్రబాబు వచ్చినా తమకు ఇవ్వాల్సిందే అని, అలా కాకుంటే అప్పుడు జ‌గన్ దగ్గరకు వెళ్లవచ్చని. అంతే తప్ప జ‌గన్ తోనే వుండాలని అనుకుంటారా? అన్నదీ అనుమానమే. ఎందుకంటే నాయకులతో జ‌నాలు వుంటారు. ఆ నాయకులు జ‌గన్ తో వుండాలి. అంతే తప్ప నేరుగా జ‌గన్-జ‌నం అనే ఈక్వేషన్ వుండదు. అది గమనించకుండా ముందుకు వెళ్తే చంద్రబాబు అండ్ కో కు అంతకన్నా ఆనందం మరోటి కలిగించదు.

-ఆర్వీ