నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు టీడీపీలో గర్వాన్ని, అతి విశ్వాసాన్ని పెంచుతున్నాయా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. వైసీపీని ఓడించిన వారిలో సైతం…టీడీపీ గెలిస్తే మనల్ని బతకనివ్వరనే అభిప్రాయాన్ని నెమ్మదిగా పెంచుతోంది. ఇదంతా టీడీపీ ఓవరాక్షన్‌తో వస్తున్న మార్పుగా గమనించాలి. ఇక అధికారంలోకి వచ్చినట్టే అనే టీడీపీ సంబరపడుతోంది. టీడీపీ అత్యుత్సాహంపై సెటైర్స్ పేలుతున్నాయి.
ప్రమాణ స్వీకారానికి కూడా ఇప్పుడే వాహనాలను బుక్ చేసుకుంటున్నారని ప్రత్యర్థులు వ్యంగ్యంగా అంటున్నారు. టీడీపీ నేతల వాలకం చూస్తే… కాస్త ఎక్కువ చేస్తున్నారనే అభిప్రాయం సొంత పార్టీ కార్యకర్తల్లోనే కలుగుతోంది. మూడు పట్టభద్రులు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఆ పార్టీకి కొండంత ఊరట ఇచ్చిందనేది వాస్తవం.
ఎన్నికలకు ఏడాది ముందు ఈ విజయాలు టీడీపీలో నైతిక స్థైర్యాన్ని పెంచాయి. అయితే ఈ విజయాలతో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టు, టీడీపీ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నట్టు ఒక పిక్చర్ ఇవ్వడానికి ఎల్లో టీం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. తాజా విజయాల నేపథ్యంలో ఊరూరా టీడీపీ సంబరాలు నిర్వహిస్తోంది. ఇంతకాలం దాక్కుని, భయపడుతూ తిరుగుతున్న ప్రతిపక్ష నేతలు వీధుల్లోకి వస్తున్నారు.
టీడీపీ కార్యకలాపాల్లో ధైర్యంగా పాల్గొనడానికి ఎమ్మెల్సీల విజయాలు దోహదం చేశాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలనేవి ప్రత్యేకమైనవి. ఇందులో ఓడిపోతే లేదా గెలిస్తే సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే ఫలితాలు వస్తాయనుకోవడం అజ్ఞానమే. అయితే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై అధికార పక్షం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో పోటీ చేయడమే తప్ప, గెలుపొందడానికి వైసీపీ తగిన వర్కౌట్ చేయలేదన్నది వాస్తవం. తీరా మూడు చోట్ల ఓడిపోయిన తర్వాత మూల్యం చెల్లించుకునే దగ్గరికి వచ్చే సరికి బాధపడుతోంది.
టీడీపీకి చేజేతులా ప్రాణం పోశామని వైసీపీ ఇప్పుడు అంతర్మథనం చెందుతోంది. అయితే ఈ ఓటములు వైసీపీని నేలమీద నడిచేలా చేస్తున్నాయి. మరోవైపు టీడీపీలో ఉత్సాహం ఎక్కువై, అతివిశ్వాసంతో నేలవిడిచి సాము చేసే పరిస్థితిలోకి నెట్టేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి బాధపెడుతున్నప్పటికీ, అప్రమత్తం చేయడానికి దోహదం చేసిందని వైసీపీ నేతలు అంటున్నారు.
టీడీపీ విషయానికి వస్తే… సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించామని, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయనే భావనను గ్రాడ్యుయేట్స్ ఫలితాలు కలిగించాయి. ఇదే టీడీపీ పాలిట ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. వైసీపీ మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకుంటే తప్ప రానున్న ఎన్నికల్లో విజయం సాధించలేమనే భయభక్తులతో మెలిగేలా చేస్తోంది. నాలుగు ఎమ్మెల్సీల గెలుపు …లాభమా? నష్టమా? అనేది కాలం చెప్పే జవాబు కోసం ఎదురు చూడాల్సిందే.